పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమమైన గమ్యస్థానమని రాష్ర్ట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ చెప్పారు.
- సీఐఐ సదస్సులో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్
హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమమైన గమ్యస్థానమని రాష్ర్ట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ చెప్పారు. మెరుగైన ప్రభుత్వ పాలసీలు, ఐటీ, స్టార్టప్స్ సంస్థలకు ప్రోత్సాహం, చక్కని మౌలిక వసతులతో వ్యాపార అనుకూల వాతావరణం ఇక్కడ ఉందన్నారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) బుధవారం బేగంపేట కాకతీయ హోటల్‌లో ‘తెలంగాణ మూవింగ్ ఫార్వర్డ్- త్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్ ఇన్నోవేషన్’పై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు.
‘సరళమైన, పారదర్శకమైన పాలసీలు, పుష్కలమైన మానవ వనరులు, పటిష్టమైన రాజకీయ నాయకత్వంతో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం. విద్య, పరిశ్రమలకు అనుసంధానం కల్పిస్తున్నాం’ అని జయేష్‌రంజన్ చెప్పారు. హైదరాబాద్‌ను డిఫెన్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీఆర్‌డీఎల్ డెరైక్టర్ జయరామన్ తెలిపారు. దేశ ఉత్పత్తులను విదేశీ రక్షణ దళాలు కొనుగోలు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ విభాగం-సీఐఐకి మధ్య 25లక్షల మొక్కలు నాటే ఒప్పందంపై జయేష్‌రంజన్, సీఐఐ తెలంగాణ చైర్‌పర్సన్ వనిత దాట్ల సంతకాలు చేశారు. సీఐఐ సౌత్ రీజియన్ డిప్యూటీ చైర్మన్ రమేష్ దాట్ల, తెలంగాణ ఉపాధ్యక్షుడు నృపేందర్‌రావు, వివిధ సంస్థల అధినేతలు పాల్గొన్నారు.