ఎట్టకేలకు..
- 21న ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం
- రెండేళ్ల తరువాత ప్రజా సమస్యలపై చర్చ
- నివేదికల తయారీలో అధికారులు బిజీ బిజీ
- ఎంపీపీ, జడ్పీటీసీల హాజరుపై సందిగ్ధత
భద్రాచలం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజనుల సమస్యలపై గత రెండేళ్లుగా ప్రస్తావించే వారే లేని పరిస్థితి. ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కూడా లేకపోవటంతో అధికారుల పాలనే కొనసాగింది. కార్యాలయం వరకూ వచ్చి తమ కష్టాలు చెప్పుకోలేని గిరిజనులు సమస్యలతోనే సహజీవనం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతి మూడు నెలలకోమారు చర్చించేందుకని నిర్వహించే గవర్నింగ్‌బాడీ సమావేశాలు కూడా రెండేళ్లుగా లేవు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా....త్వరలోనే పాలకులు కొలువుతీరుతారని భావిస్తున్న తరుణంలో... ఈనెల 21వ తేదీన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
2012 జూన్ 13న చివరిగా గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. మధ్యలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు జరిగినప్పటకీ అవి అంతంతమాత్రమేనని చెప్పాలి. రెండేళ్ల తరువాత మళ్లీ ఐటీడీఏ గవర్నింగ్ బాడీ పూర్తిస్థాయిలో సమావేశం కాబోతోంది. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేయాలని అన్ని విభాగాల అధికారులను ఐటీడీఏ పీవో దివ్య ఆదేశించారు. దీంతో ఆయా విభాగాల అధికారులు ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై, ఆయా విభాగాల ద్వారా చేపట్టిన పనులపై సమగ్ర నివేదికను తయారు చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు.
ఎన్నో సమస్యలు
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండగా ఇప్పటి వరకూ దీనిపై కార్యాచరణ లేదు. పెట్టుబడులకు బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఐటీడీఏ నుంచి గిరిజన రైతులకు ఇచ్చే సాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది నుంచి కృషి కేంద్రాల పేరుతో ట్రాక్టర్‌లు, ఇతర వ్యవయసాయ పనిమట్లు తప్ప రైతులకు కావాల్సిన విత్తనాలను మాత్రం అందించటం లేదు.
వర్షాకాలం ప్రారంభమవుతుండటంతో వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. ఉపాధి పథకం కింద కోట్లాది రూపాయిల నిధులు ఉన్నప్పటకీ పనులు సకాలంలో పూర్తి కావటం లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అస్తవ్యస్తంగానే సాగుతున్నాయి. మారుమూల గ్రామాలకు కనెక్టవిటీ పేరుతో చేపట్టిన రహదారులు పూర్తి కాలేదు. వీటిపై ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గళం విప్పే అవకాశం ఉంది.
ముంపు గోడు వినేదెవరు?
పోలవరం ముంపు మండలాలైన భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, బూర్గంపాడు( 12 గ్రామాలు మినహా), కుక్కునూరు, వేలేరుపాడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయింపు చేశారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ మండలాలను ఇప్పటి వరకూ భద్రాచలం ఐటీడీఏ అధికారులే పాలనా పరంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ మండలాలను బదలాయించటంతో వీటిపై ఎవరు అజమాయిషీ చేయాలనే దానిపై స్పష్టత లేదు.
దీంతో ఈ నెల 21న నిర్వహించే ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మండలాల సమస్యలపై ప్రస్తావించే అవకాశం ఉంటుందా లేదా అనేదానిపై అనుమానాలు ఉన్నాయి. ఫలితంగా ముంపు మండలాల్లో సమస్యలకు పరిష్కారం ఎవరు చూపుతారనేది ప్రశ్నార్థకం. వచ్చే మూడు నెలలు వరదలు, ఆపై మూడు నెలలు వ్యాధులు, ఇలా వరుస విపత్తులు ఎదుర్కొనేది కూడా ముంపు మండలాల వాసులే. గవ ర్నింగ్‌బాడీ సమావేశంలో ముంపు మండలాల ఆర్డినెన్స్, వీరి సమస్యలపై కూడా ప్రజా ప్రతినిధులు తీవ్రంగానే స్పందించే అవకాశం ఉంది.
ఈసారి గరంగరం...
ఇప్పటివరకూ సాగిన ఐటీడీఏ గవర్నింగ్‌బాడీ సమావేశాలకు, త్వరలో జరగబోయే సమావేశాలకు తీవ్రమైన వ్యత్యాసమే ఉంది. సమావేశాలకు ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ప్రాతినిధ్యం ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన వారు, అంతకు ముందు అయితే న్యూడెమోక్రసీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఈ నెల 21న నిర్వహించబోయే గవర్నింగ్‌బాడీ సమావేశంలో పాల్గొనే పార్టీల బలాబలాలు విభిన్నంగా ఉన్నాయి.ఈసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఒక ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొననుండటంతో వీరి బలమే ఎక్కువగా ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నుంచి ఒక ఎంపీ, ఎమ్మెల్యే, అదే విధంగా టీడీపీ, సీపీఎం పార్టీల నుంచి కూడా ఒక్కో ఎమ్మెల్యే పాల్గొననున్నారు. దీంతో ప్రజా సమస్యలపై సమావేశంలో తీవ్రవాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంపీపీ, జడ్పీటీసీ హాజరుపై సందిగ్ధత
జనరల్ బాడీ సమావేశాల్లో స్థానిక సమస్యలను ప్రస్తావించేది ఆయా మండల ఎంపీపీ, జడ్పీటీసీలే. కానీ జడ్పీటీసీలు ఎన్నికైనప్పటకీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంపీపీ ఎన్నిక జరుగనే లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నాటికి వీరి ప్రమాణ స్వీకారం లేకున్నట్లైతే గవర్నింగ్‌బాడీ సమావేశానికి వీరు హాజరుకానట్లే. ఈపరిణామాల నేపథ్యంలో రెండేళ్ల తరువాత జరుగుతున్న ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.