ఇది డాగ్స్‌ స్పెషల్‌! | Its a Dogs Special! | Sakshi
Sakshi News home page

ఇది డాగ్స్‌ స్పెషల్‌!

Published Wed, Sep 19 2018 2:24 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

Its a Dogs Special! - Sakshi

ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటే ఇదేనేమో. హైదరాబాద్‌లోని కుక్కలకు ఓ రోజేం ఖర్మ.. ఏకంగా ఓ పార్కే వచ్చింది. అలాంటి ఇలాంటి పార్కు కాదు.. నడిపించేందుకు వాకింగ్‌ ట్రాక్‌.. ఆటలాడించేందుకు స్థలం.. ఆటలకు ప్రత్యేక ఉపకరణాలు.. ఆటలు, విన్యాసాలకు శిక్షణ సదుపాయాలు.. స్నానం చేయించేందుకు స్లా్పష్‌ పూల్‌.. ఈత కొట్టించేందుకు స్విమ్మింగ్‌ పూల్‌... ఇలా ఎన్నో సదుపాయాలు. గచ్చిబౌలి సర్కిల్‌ పరిధిలోని కొండాపూర్‌లో జయభేరి ఎన్‌క్లేవ్‌ సమీపంలో రూపుదిద్దుకున్న ఈ ‘డాగ్‌ పార్కు’త్వరలో ప్రారంభం కానుంది. జపాన్, అమెరికా తదితర దేశాల్లో పెంపుడు కుక్కలకున్న వినోద, వ్యాయామ పార్కులు మన దేశంలో ఇప్పటి వరకు లేవు. ఇక్కడి డాగ్‌ పార్కులో ప్రత్యేక అలంకరణలు చేయించుకోవచ్చు. కుక్కతోపాటు యాంపీ థియేటర్‌లో కూర్చొని వినోదం పొందవచ్చు.    
– సాక్షి, హైదరాబాద్‌   

ప్రవేశ రుసుము రూ. 10
జీహెచ్‌ఎంసీ నుంచి లైసెన్సు పొందిన కుక్కలకే ఇందులో ప్రవేశం కల్పిస్తారు. లైసెన్సు ఇచ్చేందుకు, ఏడాది కాలపరిమితి తరువాత దాని రెన్యువల్‌కూ అవకాశం కల్పిస్తారు. యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే ఏర్పాట్లూ చేయనున్నారు. కుక్క పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేశారు. మిగతా పార్కుల్లాగే దీనికీ ప్రవేశ రుసుము ఉంది. యజమానితో సహా కుక్కకు రూ.10 ప్రవేశ రుసుము ఉంటుంది. దాన్ని చెల్లించి ఎంట్రీ పాసు పొందాలి. నెలవారీ పాసులు కూడా ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. పార్కు నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. అర్హత పొందినవారికి నిర్వహణ బాధ్యతలప్పగిస్తారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో..: కేటీఆర్‌ 
పెట్స్, పెట్‌ పేరెంట్స్‌ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పార్కును తీర్చిదిద్దినట్లు కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పెంపుడు కుక్కల కోసం ఇలాంటి పార్కు దేశంలో మరెక్కడా లేదని ప్రస్తావించారు. 

బెంగళూర్, చెన్నైల నుంచి సంప్రదిస్తున్నారు
జపాన్‌లో ఇలాంటి డాగ్‌ పార్కును చూశాను. నగరంలోని వెస్ట్‌జోన్, సెంట్రల్‌ జోన్‌లలో దాదాపు రెండున్నర లక్షల మంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుక్కలకు కూడా ఆహ్లాదం, వ్యాయామాలకు పార్కుంటే బాగుంటుందని అనిపించింది. ఇక్కడి డాగ్‌ పార్కు గురించి తెలిసి బెంగళూర్, చెన్నైల నుంచి కూడా సంప్రదిస్తున్నారు. పార్కులో వెటర్నరీ డాక్టర్, కాంపౌండర్‌తో క్లినిక్‌ను కూడా తెరుస్తాం. కుక్కల వినోదానికి తగిన విధంగా ఏర్పాట్లున్నాయని ‘కెన్నెల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’కూడా సర్టిఫై చేసింది.    
– హరిచందన దాసరి, శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement