ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి జైలుపాలైన టీడీ పీ రేవంత్‌రెడ్డికి బెయిల్ దొరికినందుకే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి జైలుపాలైన టీడీ పీ రేవంత్‌రెడ్డికి బెయిల్ దొరికినందుకే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి దొరికిన దొంగకు హారతులు పడతారా? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బెయిల్‌పై విడుదలైన రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ నేతలను దూషించడంపై మండిపడ్డారు.
ఏం ఘనకార్యం చేసి రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లాడో? రాష్ట్ర ప్రజలకు తెలుసని, ఏం సాధించి వస్తున్నాడని రూ. 2 కోట్లు ఖర్చుపెట్టి స్వాగత ఏర్పాట్లు చేశారని టీడీపీ నేతలను ప్రశ్నించారు. జైలుకు వెళ్లినవారు పశ్చాత్తాప పడి బుద్ధి తెచ్చుకుంటారని, నిర్దోషిలా బయటపడినట్లు పోజు కొట్టరని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డికి బెయి ల్ మాత్రమే దొరికిందని, నిర్దోషిగా తీర్పేమీ రాలేదని గుర్తుచేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన భాష కాదని రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడుతుందని, తప్పు ఉందో, లేదో కోర్టు తేలుస్తుందని పేర్కొన్నారు.