న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన మనం కలిసి సాగితే ఎంతో చేయగలం. ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో మన ప్రాధాన్యాలు ఉమ్మడివి’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. ఈ సందర్భంగా ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ తో మాట్లాడారు.
‘గత సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యాను. నాకు భారత్ చరిత్ర, సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని ఆమెకు తెలిపాను. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాల్లో పురోగతి విషయమై నా ఆశయాలను ఆమెతో పంచుకున్నాను. ప్రధాని మోదీతో జరిగే సంభాషణలో ఈ అంశం మరింత ముందుకువెళ్తుందని ఆశిస్తున్నాను. భారత్ పర్యటన పట్ల ఎంతో ఎక్సైటింగ్‌గా ఉన్నాను’ అని ఆమె అన్నారు.
‘భారత్, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అవకాశాలను సృష్టించడం, పౌరులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించడం అతిపెద్ద సవాలు. ఇటు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, అటు భారత్‌లో నరేంద్రమోదీ పౌరులకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ప్రగతి కోసం కృషి చేస్తున్నారు’ అని ఆమె అన్నారు.
జీఈఎస్ గురించి ఇవాంక మాట్లాడుతూ.. తొలిసారి ఈ సదస్సులో పాల్గొంటున్న వారిలో 50శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారిత ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఓ అంతర్జాతీయ వేడుకగా నిలుస్తుందని నేను భావిస్తున్నారు. మహిళలు రాణిస్తే.. సమాజాలు, దేశాలు వర్ధిల్లుతాయి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment