తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఇబ్బందుల పాలు చేయడానికే ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఇబ్బందుల పాలు చేయడానికే ఏపీ సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఆయన వైఖరి నోటితో మాట్లాడి, నొసటితో వెక్కిరించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి సీఎంను అన్న విషయం మరిచి పోయి, తెలంగాణ విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
ఓ వైపు కరీంనగర్ బహిరంగ సభలో ‘విద్యుత్ అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తా ’.. అని అంటూ, మరో వైపు ఢిల్లీలో తన అధికారులతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి వద్ద కృష్ణపట్నం నుంచి తెలంగాణకు కరెంటు ఇవ్వబోమని చెప్పించారని వివరించారు. కార్పొరేషన్లను విడదీయడంలో, కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో పేచీలు పెడుతున్నారని అన్నారు.