‘ఇయర్‌ ఫోన్లు’ ఉంటే ‘సెల్‌’లోకే! | jailed and challan for earphones driving | Sakshi
Sakshi News home page

‘ఇయర్‌’ ఉంటే ‘సెల్‌’లోకే!

Published Thu, Feb 15 2018 8:39 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

jailed and challan for earphones driving - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,సిటీబ్యూరో: 2017 నవంబర్‌ 15... బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.1/12 జంక్షన్‌... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ గర్భిణి రోడ్డు దాటుతోంది... సిగ్నల్‌ను పట్టించుకోని ఆర్టీసీ డ్రైవర్‌ బస్సు ముందుకు నడిపాడు... ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకున్న ఆమె విషయం గమనించలేకపోయింది... ఫలితం గా బస్సు కింద పడి కన్నుమూసింది. 

ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర ట్రాఫిక్‌ పోలీసులు ‘ఇయర్‌ ఫోన్‌’ను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వీటిని ధరిస్తే పాదచారులే కాదు వాహనం నడిపే వారూ చుట్టుపక్కల పరిస్థితులను గమనించలేరని గుర్తించారు. దీంతో ఇయర్‌ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్‌ చేస్తూ చిక్కుతున్న వారిపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఈ నెలలో ప్రారంభించిన ఈ విధానంలో ఇప్పటి వరకు 192 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. వీరిలో ఆరుగురికి న్యాయస్థానం రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. త్వరలో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తున్న వారి పైనా చార్జ్‌షీట్లు దాఖలు చేయనున్నట్లు నగర ట్రాఫిక్‌ డీసీపీ–2 ఏవీ రంగనాథ్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

సెల్‌ కన్నా ఇదే డేంజర్‌...
నగరంలోని అనేక ప్రాంతాల్లో సెల్‌ఫోన్, ఇయర్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ సర్వసాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ రకంగా వాహనాలు నడుపుతున్నారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కన్నా ఇయర్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సెల్‌ఫోన్‌ వాడే వ్యక్తి కేవలం కాల్‌ వచ్చినప్పుడే లిఫ్ట్‌ చేసి మాట్లాడటానికి వినియోగిస్తాడని, ఓ చెవిలో ఫోన్‌ పెట్టుకున్నా... మరో చెవి ద్వారా పరిసరాలను కాస్త అయినా పరిశీలించే, పరిస్థితుల్ని గుర్తించే ఆస్కారం ఉంటుందన్నారు. ఇయర్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ చేసే వారిలో అత్యధికులు కాల్‌ మాట్లాడటం కంటే సంగీతం, పాటలు వినడానికే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఎం రేడియో సంస్కృతి పెరిగిన నేపథ్యంలో ఈ ధోరణి మరింత ఎక్కువైందని చెబుతున్నారు. 

ఇప్పటి వరకు జరిమానాలే...
ఇలా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, ఇయర్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన వారికి ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసుల కేవలం జరిమానా మాత్రమే విధించే వారు. సాధారణంగా ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా పరిగణించేవి, వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ముప్పు తీసుకువచ్చేవి. సెల్‌/ఇయర్‌ ఫోన్‌ డ్రైవింగ్‌కు ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఈ మూడో కేటగిరీలోకి చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉల్లంఘనులకు కేవలం జరిమానా విధించడం కాకుండా కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కంటే ప్రమాదకరమైంది కావడంతో తొలిదశలో ఇయర్‌ ఫోన్‌ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టారు. కోర్టులో చార్జ్‌షీట్లు దాఖలు చేయడానికి అనువుగా ఇందుకు ఎంవీ యాక్ట్‌లో ప్రత్యేక సెక్షన్‌ లేదు. దీంతో ప్రమాదరకంగా వాహనం నడపటం (సెక్షన్‌ 184) కింద అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. 

‘బ్లూటూత్‌’ను ఎలా గుర్తిస్తారో?
ఈ నెలలో ఇప్పటి వరకు ట్రాఫిక్‌ పోలీసుల 192 మంది ఇయర్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తున్న వారి ని పట్టుకున్నారు. వీరి నుంచి వాహనాలు స్వాధీ నం చేసుకున్న అధికారులు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్‌ అనంతరం చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తూ కోర్టులో హాజరుపరిచా రు. కేసు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆరుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. ద్విచక్ర వాహన చోదకు డు ఇయర్‌ఫోన్‌/సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తుంటే గుర్తించడం తేలికే. కార్లలో వెళ్తున్న వారి విషయంలోనే ఇది కాస్త కష్టసాధ్యం. మరోపక్క ఇటీవల కాలంలో కార్లలో బ్లూటూత్స్‌ వినియోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎలా పట్టుకుంటా రు? ఇలాంటి వాహనాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున మ్యూజిక్‌ వినే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది కీలకంగా మారింది. నగరంలోని రోడ్లపై పాదచారులు సైతం ఇయర్‌ఫోన్, సెల్‌ఫోన్లు వినియోగించి నడుస్తూ వాహనచోదకులకు ఇబ్బందులు తెస్తున్నారు. అయితే మోటారు వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని ట్రాఫిక్‌ అధికారులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement