
పోస్టుమార్టం చేయాలంటూ వైద్యుడికి సూచిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ అనితా రెడ్డి
డ్యూటీలో ఉండికూడా.. శవానికి పోస్టుమార్టం చేయకుండా ముప్పుతిప్పలు పెట్టిన ఓ వైద్యుడి తీరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం
జమ్మికుంట(హుజూరాబాద్): డ్యూటీలో ఉండికూడా.. శవానికి పోస్టుమార్టం చేయకుండా ముప్పుతిప్పలు పెట్టిన ఓ వైద్యుడి తీరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చర్చనీయాంశమైంది. జిల్లా అధికారులు సస్పెండ్ ఉత్తర్వులు పంపిస్తేగానీ.. సదరు వైద్యుడు మెట్టు దిగలేదు.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీ రాములపల్లికి చెందిన కోలె భిక్షపతి (50) ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల వేములవాడకు కుటుంబంతో సహా వెళ్లాడు. అక్కడ ఈనెల 6న మృతి చెందాడు. శవాన్ని శుక్రవారం ఉదయం గ్రామానికి తీసుకొచ్చి పరిశీలించగా.. గాయాలు కనిపించాయి. దీంతో బంధువులు ఇల్లందకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శుక్రవారం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో పోస్టుమార్టం చేసే వైద్యుడు సుధాకర్‌రావు ఉన్నారు. పోలీసులు ఇంక్వెస్ట్ ( ముందస్తు సమాచారం) ఇవ్వకపోవడం..అప్పటికే సాయంత్రం 5.30 గంటలు కావడంతో పోస్టుమార్టం చేయలేదు. శనివారం డాక్టర్ సుధాకర్‌రావు సెలవులో ఉండగా, డాక్టర్ పవన్‌కుమార్ డ్యూటీలో ఉన్నారు. ఇల్లందకుంట ఎస్సై నరేశ్ ఆసుపత్రికి వచ్చి భిక్షపతి శవానికి పోస్టుమార్టం చేయాలని ఇంక్వెస్ట్ ఇచ్చారు. దీనికి డాక్టర్ పవన్‌కుమార్ నిరాకరించారు.
శవాన్ని తీసుకొచ్చిన సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యుడే పోస్టుమార్టం చేయాల్సి ఉంటుందని తెగేసి చెప్పాడు. విస్మయానికి గురైన ఎస్సై ‘డ్యూటీలో ఎవరుంటే వారే పోస్టుమార్టం చేయాలి కదా..’అని చెప్పినా వినిపించుకోలేదు. విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. వైద్యుడు ససేమిరా అన్నాడు. దీంతో ఎస్సై జిల్లా వైద్యాధికారి రాజేశం దృష్టికి తీసుకెళ్లారు. భిక్షపతి చనిపోయి మూడురోజులవుతోందని, పోస్టుమార్టం చేయడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే వైద్యాధికారి రాజేశం అనితారెడ్డితో మాట్లాడారు. పోస్టుమార్టం చేయకుంటే పవన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆదేశించారు. అనితారెడ్డి సస్పెండ్ లెటర్ సిద్ధం చేసినా.. వైద్యుడు మాత్రం మెట్టు దిగలేదు. ఉద్యోగం కోల్పోతావంటూ అక్కడున్నవారంతా హెచ్చరించడంతో చివరికి పోస్టుమార్టం చేశాడు.