నియామకాలేవి..? | janareddy questioned TRS government about jobs | Sakshi
Sakshi News home page

నియామకాలేవి..?

Published Sat, Mar 21 2015 1:56 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

నియామకాలేవి..? - Sakshi

నియామకాలేవి..?

  • అసెంబ్లీలో సర్కారును నిలదీసిన జానారెడ్డి
  • ఖాళీల భర్తీపై చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం
  • తిరస్కరించిన స్పీకర్, విపక్ష నేత ఆగ్రహం.. సభ నుంచి వాకౌట్
  • ఖాళీలు ప్రకటించిన వాళ్లం.. ఇవ్వకుండా పోతామా?
  • త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామన్న మంత్రి ఈటెల
  • ఓయూలో నిరుద్యోగ జేఏసీ నిరసన
  •  
    సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఉద్యోగాల భర్తీ అంశం శుక్రవారం శాసనసభను కుదిపేసింది. నియామకాలను చేపట్టాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఉద్యోగాల కోసం రాష్ర్ట యువత ఎదురుచూస్తోందని,  నియామకాల్లో జాప్యం వల్ల జరుగుతున్న అనర్థాలపై చర్చించాలని కోరింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అంశంపై చర్చకు నిరాకరించడమేంటని ప్రశ్నించారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు చేస్తున్నా.. సభలో చర్చకు అవకాశమివ్వరా అని నిలదీశారు. దీనిపై ఆర్థిక మంత్రి ఈటెల వివరణ ఇచ్చినా శాంతించకుండా జానాతో పాటు కాంగ్రెస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.  
     
    రాష్ట్ర ఏర్పాటుతో నిరుద్యోగుల్లో ఆశలు
    రాష్ర్టం ఏర్పాటైన నేపథ్యంలో ఖాళీల భర్తీపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని, దీనిపై చర్చకు అనుమతించాలని సభాపతిని జానారెడ్డి కోరారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాల విషయంలో సానుకూల చర్యలు ఉంటాయని అంతా ఆశించారు. ఇప్పుడు దీనిపై వాయిదా తీర్మానాన్ని ఇస్తే తిరస్కరిస్తున్నారు. బడ్జెట్ సమయాన్ని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. అయినా ప్రతిరోజూ వాయిదా తీర్మానాలను తిరస్కరించడం సమంజసమా? నిరుద్యోగులపై ఓయూలో లాఠీచార్జి జరిగినా చర్చకు అవకాశమివ్వరా? దీనిపై కనీసం స్వల్పకాలిక చర్చకైనా అవకాశమివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు.
     
    దీనిపై మంత్రి ఈటెల స్పందిస్తూ.. ‘ఐఏఎస్ అధికారుల విభజనే వారం కింద జరిగింది. కమలనాథన్ కమిటీ నివేదిక రావాల్సి ఉంది. హైకోర్టును విభజించాలని కూడా కోరుతున్నాం. శాఖల వారీగా ఖాళీలు తెప్పించుకుంటున్నాం’ అని తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘విద్యార్థులకు ఉద్యోగాలను ఎప్పటికైనా మేమే ఇస్తాం.. మీరు ఇవ్వలేరు. దీనిపై మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. ఇప్పటికే పోలీసు శాఖలో డ్రైవర్లు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో ఇంజనీర్ల భర్తీకి సిద్ధమయ్యాం. త్వరలోనే నియామకాలు చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు జానారెడ్డి అభ్యంతరం తెలిపారు. ‘ఇచ్చేది మేము, మీరెవరు’ అన్న ధోరణి మంచిది కాదని, సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం చెప్పినదల్లా వినడానికి సిద్ధంగా లేమన్నారు.  
     
    ప్రకటించినవాళ్లం.. ఇవ్వకుండా పోతామా?: ఈటెల
    ‘ఉద్యోగాలు ఎవరిస్తారు.. ప్రభుత్వమే కదా. ఉద్యోగాలు భర్తీ  చేస్తామంటే విపక్ష నే త జానారెడ్డికి ఎందుకంత అసహనం? ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. జీవోలు ఇవ్వలేవు కదా. అయినా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఖాళీలను ప్రకటించిన వాళ్లం, ఇవ్వకుండా పోతామా..’ అని మంత్రి ఈటెల అసెంబ్లీ లాబీల్లో మీడియాతో అన్నారు. ఈ విషయంలో విపక్షాలది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ చెల్లింపుల వల్ల ప్రభుత్వంపై రూ.5 వేల కోట్ల భారం పడుతోందని, దాని సర్దుబాటుపై ఆలోచిస్తున్నామన్నారు. రాజకీయ లబ్ధికోసం అనవసర అంశాలను విపక్షాలు ప్రచా రం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, గత పాలకుల నిర్లక్ష్యంతోనే నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరోపించారు.  
     
    లక్ష ఉద్యోగాలేమయ్యాయి?:వంశీ
    ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ విసిగి వేసారి ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు తొమ్మిది నెలల్లో ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ తన ఇంట్లో వారికి మాత్రం ఉద్యోగాలు కల్పించుకున్నారని వ్యాఖ్యానించారు.  
     
    ఓయూలో నిరుద్యోగుల నిరసన
    ఓయూ: అసెంబ్లీలోని పరిణామాలపై ఉస్మానియా యూనివర్సిటీలోని నిరుద్యోగ సంఘాలు నిరసన తెలిపాయి. మంత్రి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు దహనం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ముదిరాజ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఈటెల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం తిరస్కరణకు గురవడం, ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేయడాన్ని టీవీల్లో చూసిన నిరుద్యోగ జేఏసీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు.

    కొంతమంది విద్యార్థుతో ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకుని అక్కడి ఈటెల ఫ్లెక్సీలను తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నార ంటూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యోగాల కోసం పోరాడుతుంటే నిరుద్యోగులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, అయినా భయపడేది లేదని, నియామక ప్రకటనలు వచ్చే వరకు ఉద్యమిస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్, అధ్యక్షుడు కోటూరి మానవతరాయ్ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement