
ఇది ఊహల బడ్జెట్
హైదరాబాద్: బడ్జెట్ అంటే అలంకారప్రాయం, నినాదాలతో కూడినది కాదని.. స్పష్టమైన విధానాన్ని కలిగి ఉండాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ర్ట బడ్జెట్ ఆచరణాత్మకంగా లేదు. అనుభవంతో అధ్యయనం చేసినట్లు లేదు. ఊపుతో ఊహాలోకంలో విహ రించినట్లుగా ఉంది. గత బడ్జెట్‌లో అంచనాలనే.. సవరించిన బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. వాస్తవ ఖర్చులను చూపించలేదు. సవరింపులు లేనప్పుడు బడ్జెట్ పుస్తకాల్లో ఖాళీగా చూపెట్టినా సరిపోయేది’ అని శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా జానా వాఖ్యానించారు. రాష్ర్ట ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తున్నామని, సామాజిక, ఆర్థిక న్యాయంతో కూడిన పాలన అందించేందుకు రాష్ర్ట ప్రభుత్వానికి సహకరిస్తున్నామని పేర్కొన్నారు.
అంత ఆదాయం అసాధ్యం
పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం రూ. 59 వేల కోట్లుగా చూపిందని, అది అసాధ్యమని జానారెడ్డి తేల్చిచెప్పారు. గత బడ్జెట్‌లో 8 నెలలకు రూ. 30 వేల కోట్లు వచ్చి ఉంటుందని, ఆ లెక్కన ఏడాదికి చూసుకుంటే అది రూ. 44 వేల కోట్లకు మించదని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం మాత్రం పన్ను ఆదాయాన్ని దాదాపు 34 శాతం మేర పెంచి చూపిందన్నారు. పన్నేతర ఆదాయం కింద భూముల క్రమబద్ధీకరణ, మొబిలైజేషన్ తదితరాల ద్వారా రూ. 13,500 కోట్లు చూపారని, గత బడ్జెట్‌లో రూ. 6,500 కోట్లు చూపితేనే అది అసాధ్యమని తాను అప్పుడే చెప్పానన్నారు. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని పేర్కొన్నారు.
అప్పుల లెక్కలూ అంతే..
జీఎస్‌డీపీలో 3 శాతానికి మించి అప్పులు తెచ్చుకునే అవకాశం లేనప్పటికీ, సభలో సీఎం దాన్ని 3.5 శాతానికి సాధిస్తామని చెప్పారని, అది కూడా కుదరదని జానారెడ్డి పేర్కొన్నారు. ‘ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం అదనంగా అప్పు పుట్టాలంటే రెండు అంశాల్లో అర్హత సాధించాలి. జీఎస్‌డీపీలో 25 శాతం కంటే తక్కువగా అప్పులు ఉంటే 0.25 శాతం కొత్త అప్పు సాధ్యం. కానీ వడ్డీలు చెల్లించే మొత్తం 10 శాతానికి మించరాదనే నిబంధనలో మనం విఫలమవుతాం. మన వడ్డీలు రూ. 5 వేల కోట్లలోపే పరిమితమై ఉంటే ఈ అర్హత సాధించేవాళ్లం. కానీ మన వడ్డీల మొత్తం రూ. 6 వేల కోట్లకు చేరింది. వెరసి 3.25 శాతానికి మించి అప్పు పుట్టదు’ అని జానా వివరించారు. దీనికోసం అంతా కలిసి ప్రధాని వద్దకు వెళ్దామనే ప్రయాస అనవసరమన్నారు.
ప్రణాళిక పద్దు కూడా డొల్లనే...
వివిధ పథకాలకు రూ. 52 వేల కోట్లు వ్యయం చేయనున్నట్టు ప్రణాళిక పద్దు కింద చూపడం కూడా నిర్మాణాత్మకంగా లేదన్నారు. ఆ పద్దు కింద రూ. 30 వేల కోట్లను మించి ఖర్చు చేయలేరని ప్రతిపక్ష నేత తేల్చిచెప్పారు. ఈ విషయంలో గత బడ్జెట్ సమయంలో తాను చెప్పిన లెక్కలు నిజమయ్యాయని, అప్పుడు రాసిన కాగితం ఇప్పటికీ తనవద్దే ఉందని దాన్ని చూపించారు. తన మాటలను గమనంలోకి తీసుకుని వెంటనే బడ్జెట్ అంకెలను వాస్తవబద్ధంగా సవరించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. లేకుంటే ప్రజలను గందరగోళపరచడం మినహా ప్రయోజనం ఉండదన్నారు. అలాగే రాష్ర్టంలో సుమారు రూ. 40 వేల కోట్ల విలువైన నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో తుది దశలో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని జానారెడ్డి సూచించారు.
టీఎంసీకి అంత స్థిరీకరణ సాధ్యమా?
ఒక టీఎంసీ నీటికి 15 వేల ఎకరాల స్థిరీకరణ లెక్కతో ప్రాజెక్టు అంచనాలు రూపొందిస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. బిందు, తుంపర సేద్యం పద్ధతిలో అది సాధ్యమని గతంలో లెక్కలేశారని, కానీ ఆ రెండు పద్ధతులు ఖరీదైనవని, వాటికి ప్రత్యేక నిధులెలా కేటాయిస్తారో చూపకుండా తాజా బడ్జెట్‌ను రూపొందించారని పేర్కొన్నారు. మామూలుగా టీఎంసీ నీటితో ఆరేడు వేల ఎకరాల వరకే సాగు సాధ్యమన్నారు. మిషన్ కాకతీయలో ముఖ్య చెరువులనే ఎంపిక చేయాలని, నీటి పారుదల లేని కాలువలను కూడా ఆ పథకంలో చేర్చి మరమ్మతులు పూర్తి చేయాలని సర్కారుకు సూచించారు.
కాంగ్రెస్ వల్లే ఈ మాత్రం కరెంటు..
క రెంటు విషయంలో కాంగ్రెస్‌ను నిందించడం మానుకోవాలన్నారు. తమ వల్లనే ప్రస్తుతం ఈ మాత్రం కరెంటు ఉందని, త్వరలో అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టులు కూడా తాను శ్రీకారం చుట్టినవేనని జానా గుర్తుచేశారు. త్వరలో అందుబాటులోకి రానున్న 600 మెగావాట్ల భూపాలపల్లి, 1200 మెగావాట్ల సింగరేణి, 209 మెగావాట్ల సీజీఎస్ ప్లాంట్లు కాంగ్రెస్ పుణ్యమేనని, విభజన చట్టంలో పొందుపరిచిన 4 వేల మెగావాట్ల ఎన్‌టీపీసీ కేంద్రం కూడా కాంగ్రెస్ చలవేనని పేర్కొన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అయితే ఆ పేరుతోఇప్పటికే నిర్మాణంలో ఉన్న 4.67 లక్షల ఇళ్లకు బిల్లు లు ఆపడం సరికాదన్నారు. రెండు పడక గదుల ఇళ్లకు కేవలం రూ. 391 కోట్లు కేటాయించడంపై జానా అసంతృప్తి వ్యక్తం చేశారు.