
అలంకారప్రాయంగా బడ్జెట్: జానారెడ్డి
బడ్జెట్ కేటాయింపులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్లో చూపిన మేరకు ఆదాయాలు రావని, ట్యాక్స్, గ్రాంట్స్లో ప్రభుత్వం చూపినంత రాబడి ఉండదన్నారు. రూ.20వేల కోట్లు నిధులు తగ్గుతాయని, ఈ మేరకు అభివృద్ధి పథకాలకు నిధుల కోత తప్పదన్నారు.
బడ్జెట్ అలంకార ప్రాయంగా ఉందని, నిర్ధిష్టంగా, నిర్మాణాత్మకంగా లేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే బడ్జెట్ గణాంకాలు గందరగోళపరుస్తున్నాయని, ఇరిగేషన్లో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ముందుచూపుతో ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు సరిపోయే కేటాయింపులు లేవని, దళితులకు మూడెకరాల భూమి పరిస్థితి అలాగే ఉందన్నారు. రుణమాఫీ అంశం ఇటు రైతులకు, ప్రజలకు ఇబ్బందిగా ఉందన్నారు.