జ్యోతి ప్రజ్వలన చేసి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభిస్తున్న జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీ, ప్రోత్సాహకాలను పూర్తిగా చెల్లించేందుకు ఏడాది సమయం పడుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. పరిశ్రమలకు రూ.1,800 కోట్ల రాయితీ, ప్రోత్సాహకాల బకాయిలు ఉండగా.. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,300 కోట్లు కేటాయించిందని చెప్పారు. మిగతా రూ.500 కోట్ల బకాయిలకు వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖాయిలా పడిన ఎంఎస్‌ఎంఈలకు చేయూత అందించి, మళ్లీ పనిచేసేందుకు సహకరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో టీఐహెచ్‌సీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సంస్థ అపూర్వ విజయాలు అందుకుని యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తాం..
మార్కెటింగ్ వైఫల్యాలు, పెద్ద పరిశ్రమల నుంచి తీవ్ర పోటీతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ, ప్రోత్సాహకాలు సకాలంలో అందMýఠిb పోవడంతో.. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతబడుతున్నట్టుగా టీఐహెచ్‌సీ జరిపిన అధ్యయనంలో తేలిందని జయేశ్ రంజన్ చెప్పారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా గుర్తించి పరిష్కరిస్తే.. అవి మూతపడకుండా కాపాడుకోగలమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు బాగా వృద్ధిలో ఉన్నట్టుగా తమ పరిశీలనలో తేలిందని.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఖరీదైనప్పటికీ దీర్ఘకాలికంగా లాభాలు ఆర్జించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.
అధిక విద్యుత్ చార్జీలతో పలు పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కానీ నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకుంటున్న చర్యల కారణంగా అధిక చార్జీలు తప్పడం లేదని పేర్కొన్నారు. కాగా.. ఖాయిలా పడిన 50 పరిశ్రమలపై టీఐహెచ్‌సీ ఆధ్వర్యంలో అధ్యయనం జరపగా.. 60 శాతం పరిశ్రమలు ఆర్థికేతర సమస్యలతోనే మూతపడినట్టు తేలిందని సంస్థ సీఈఓ ఎం.సంజయ్ చెప్పారు. ప్రధానంగా విద్యుత్ సరఫరా, నోట్ల రద్దు, జీఎస్టీ సంబంధిత అంశాలు, భారీగా పేరుకున్న వాణిజ్య పన్నుల బకాయిలు, వ్యూహాత్మక నిర్వహణ లోపాలు వంటి సమస్యలే కారణమని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు సకాలంలో అందక మరో 38 శాతం పరిశ్రమలు మూతపడ్డాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment