హైదరాబాద్‌ మెట్రో: కల నిజమాయె.. | JBS to MGBS Metro Starts From Today Hyderabad | Sakshi
Sakshi News home page

దివంగత సీఎం వైఎస్సార్‌ స్వప్నం సాకారం

Published Fri, Feb 7 2020 7:44 AM | Last Updated on Fri, Feb 7 2020 3:37 PM

JBS to MGBS Metro Starts From Today Hyderabad - Sakshi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ స్వప్నం సాకారమైంది.భాగ్యనగర జీవనరేఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు తొలిదశ సంపూర్ణమైంది. వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో పూర్తయ్యింది. ఎల్బీనగర్‌– మియాపూర్‌ (29 కి.మీ), నాగోల్‌– రాయదుర్గం(29 కి.మీ), ఇప్పటికే అందుబాటులో ఉండగా.. నేడు జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ (11 కి.మీ) రూట్‌  ప్రారంభం కానుండటంతో లక్ష్యం పరిపూర్ణమైంది. నగర మెట్రో ప్రాజెక్టుకు 2008లోనే ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఎన్నో బాలారిష్టాలను అధిగమించి 2012లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టినప్పటికీ.. అవి పూర్తయ్యేనాటికి నిర్మాణ వ్యయం రూ.17,132 కోట్లకు చేరుకుంది. తొలుత 2017 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. ఆస్తుల సేకరణ, న్యాయపరమైన చిక్కులు, పనులు చేపట్టేందుకు రైట్‌ ఆఫ్‌ వే సమస్యల నేపథ్యంలో ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమైంది. మెట్రోఅధికారుల అంచనా ప్రకారం మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది జర్నీ చేస్తారని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ప్రయాణికుల మార్క్‌ 4 లక్షలకు మించలేదు. 2016 నుంచి ఇప్పటివరకు సుమారు 10 కోట్ల మంది మెట్రో రైళ్లలో జర్నీ చేసినట్లు అధికారులుప్రకటించారు.

నేర్చుకోవాల్సిన పాఠాలివీ..
టప్రతి స్టేషన్‌ వద్ద ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేసైనామల్టీలెవల్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి. పార్కింగ్‌ ఫీజు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలి. టమెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు సులువుగా చేరుకునేందుకు(లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ)  బ్యాటరీ బస్సులు, మినీ బస్సులను నిరంతరం అందుబాటులో ఉంచాలి. వీటిని స్టేషన్ల వద్ద నిలిపేందుకు వీలుగా బస్‌బేలు ఏర్పాటు చేయాలి. టమెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణీకులకు నామమాత్రపు అద్దె ప్రాతిపదికన బైక్‌లు, సైకిల్‌లు ఇచ్చే ఏర్పాటు చేయాలి. టప్రతి స్టేషన్‌ వద్ద ఓలా, ఉబర్‌ క్యాబ్‌లు, ఆటోలను నిలిపేలా చర్యలు తీసుకోవాలి. వారి దోపిడీని నివారించాలి. టప్రతి స్టేషన్‌ను సమీప బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన కార్యాలయాలు, మాల్స్‌లోకి సులువుగా చేరుకునేందుకు వీలుగా ఆకాశమార్గాలు(స్కైవాక్‌లు)ఏర్పాటు చేయాలి.

లాభమా..? నష్టమా..?
మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 50 శాతం రెవెన్యూ రియాల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. మొత్తంగా ప్రభుత్వం నిర్మాణ సంస్థకు వివిధ ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల విలువైన స్థలాల్లో రాబోయే 10–15 ఏళ్లలో రూ.2243 కోట్లతో వివిధ ప్రాంతాల్లో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్, ఇతర వాణిజ్యస్థలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే  గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఆర్థిక కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. రియాల్టీ, టూరిజం, నిర్మాణరంగం తదితర మఖ్యమైన రంగాల్లో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఆశిస్తున్న మేర 50 శాతం ఆదాయం సమకూరుతుందా..? లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరిన 2011లో 18 చోట్ల మాల్స్‌ నిర్మించాలని భావించినా ఇప్పటివరకు కేవలం ఐదు ప్రాంతాల్లో మాత్రమే మాల్స్‌ నిర్మాణం చేపట్టడం గమనార్హం.

మెట్రో విశేషాలు ఇవీ..  
కారిడార్‌ 1 : మియాపూర్‌ – ఎల్బీనగర్‌ : 29 కి.మీ, 27 స్టేషన్లు – రెడ్‌ లైన్‌ ( ఏ కారిడార్‌)
కారిడార్‌ 2 : జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ : 11 కి.మీ, 9 స్టేషన్లు – గ్రీన్‌ లైన్‌  ( బీ కారిడార్‌ )
కారిడార్‌ 3 : నాగోల్‌ – రాయదుర్గ్‌ : 29 కి.మీ, 23 స్టేషన్లు – బ్లూ లైన్‌ ( సీ కారిడార్‌ )
మెట్రో తొలి పిల్లర్‌ ఏర్పాటు : 2012 ఏప్రిల్‌ 19 ఉప్పల్‌ జెన్‌ప్యాక్ట్‌  
మొత్తం మెట్రో పిల్లర్లు : 2599 ( ఎంజీబీఎస్‌ చివరి పిల్లర్‌ )
రోజూవారి మెట్రో ప్రయాణికులు : సుమారు 4 లక్షలు  
మెట్రో మాల్స్‌ : పంజాగుట్ట , ఎర్రమంజిల్, హైటెక్‌ సిటీ, రాయదుర్గం, మూసారంబాగ్,  
స్కై వాక్‌ : పంజగుట్ట మెట్రో స్టేషన్‌ నుంచి సమీపంలోని మెట్రో మాల్‌ కి నేరుగా చేరుకొనేలా నిర్మాణం
మెట్రో రైళ్లు , స్టేషన్లలో వస్తువులు పోగొట్టుకుంటే కస్టమర్‌ కేర్‌ నం: 040–23332555
అమీర్‌పేట్‌ , నాగోల్, మియాపూర్‌ మెట్రో స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం
ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ కేంద్రాలు: బేగంపేట్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ మెట్రో స్టేషన్లు

నగర మెట్రో ప్రస్థానం సాగిందిలా..

అంచలంచెల అభివృద్ధి                                    తేదీ
హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ ప్రారంభం     మే 14–2007
ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబరు 19–2008
మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం రద్దు    జూలై 7–2009
రెండోమారు ఆర్థిక బిడ్లు తెరిచింది    జూలై 14–2010
ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది  సెప్టెంబరు 4–2010
మెట్రో డిపో నిర్మాణానికి ఉప్పల్‌లో 104 ఎకరాల కేటాయింపు    జనవరి–2011
ఫైనాన్షియల్‌ క్లోజర్, కామన్‌ లోన్‌ అగ్రిమెంట్‌ కుదిరింది    మార్చి–2011
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియాకు సెంట్రల్‌మెట్రో యాక్ట్‌ వర్తింపు    జనవరి– 2012
104 ఎకరాల మియాపూర్‌ డిపోల్యాండ్‌నుఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు కేటాయింపు    మార్చి–2012
మెట్రో గ్రౌండ్‌ వర్క్స్‌ ప్రారంభం ఏప్రిల్‌ 26– 2012
కియోలిస్‌ సంస్థకు మెట్రో రైళ్ల నిర్వహణకు కాంట్రాక్టు కేటాయింపు    మే 2012
రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం కేటాయింపు ఆగస్టు 2012
కుత్భుల్లాపూర్‌ కాస్టింగ్‌యార్డులో 62 ఎకరాల హెచ్‌ఎంటీ స్థల లీజు    సెప్టెంబరు 2012
బోగీల తయారీకి హ్యూండాయ్‌ రోటెమ్‌ కంపెనీతో ఒప్పందం    సెప్టెంబరు 2012
మెట్రో రైలు పనుల ప్రారంభం    నవంబరు 25– 2012
కేంద్ర ప్రభుత్వం నుంచి సర్దుబాటు నిధిరూ.1458 కోట్ల విడుదలకు ఆమోదం    మే 2013
హైదరాబాద్‌ మెట్రో మూడు కారిడార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదల    సెప్టెంబర్‌ 2014
రైల్వే బోర్డు నుంచి హెచ్‌ఎంఆర్‌కుసిగ్నలింగ్‌ టెలికాం సిస్టంకు అనుమతి    జనవరి 20–2015
వేలీవ్‌ ఛార్జీలు లేకుండా మెట్రో రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతి  జనవరి 23–2015
మెట్రో కారిడార్‌3 స్టేజ్‌1కు ఆర్‌డీఎస్‌ఓ సంస్థ నుంచి స్పీడ్‌ సర్టిఫికెట్‌    మే 8– 2015
నాగోల్‌ మెట్టుగూడ(8కి.మీ)కు సీఎం ఆర్‌ఎస్‌ ధ్రువీకరణ జారీ    ఏప్రిల్‌ 20– 2016
మెట్రోకు ప్రత్యేక విద్యుత్‌ టారిఫ్‌ను వర్తింపజేస్తూ ప్రభుత్వ నిర్ణయం    ఏప్రిల్‌ 27– 2016
ఆర్‌డీఎస్‌ఓ నుంచి 80 కి.మీ వేగంతోమెట్రో రైళ్లు దూసుకెళ్లేందుకు అనుమతి    జూన్‌ 17–2016
మియాపూర్‌ ఎస్‌.ఆర్‌.నగర్‌మార్గంలోప్రయాణికుల రాకపోకలకుసీఎంఆర్‌ఎస్‌ అనుమతి    ఆగస్టు 16–2016
మెట్రో ప్రాజెక్టును 2018 నవంబరు 30 నాటికి పూర్తికి  ప్రభుత్వ ఆదేశాల జారీ    ఆగస్టు 16–2016
హెచ్‌ఎంఆర్‌ ప్రాజెక్టుకు భద్రతను మంజూరు చేస్తూ మున్సిపల్‌ శాఖ ఆదేశాలు    ఆగస్టు 22– 2017
కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నుంచి మెట్టుగూడ–అమీర్‌పేట్‌ మార్గానికి అనుమతి    నవంబర్‌ 20– 2017

పాతబస్తీపై ఎందుకీ నిర్లక్ష్యం..  మెట్రో పై అసదుద్దీన్‌ ట్వీట్‌..
హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో మెట్రో పనులంటే అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ట్విటర్‌ వేదికగా నిలదీశారు. దీనిపై నెటిజన్లు కూడా విమర్శలు కురిపించారు. ముస్లింలు పన్నులు చెల్లించడం లేదా అంటూ ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. పాతబస్తీ విషయానికి వచ్చే సరికే ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తాయంటూ మరో నెటిజన్‌ నిలదీశారు. ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు మెట్రో పనులు పూర్తి చేయడానికి మీకు నిధులు ఉంటాయి. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తారు?’ అని అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశ్నించారు. నేడు జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందంటూ మెట్రో యాజమాన్యం చేసిన ట్వీట్‌కు బదులిస్తూ అసదుద్దీన్‌ ఈ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థను ట్యాగ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement