సింగరేణిలో జాబ్ మేళా | Job Mela in Singareni | Sakshi
Sakshi News home page

సింగరేణిలో జాబ్ మేళా

Published Sat, Jun 13 2015 3:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

సింగరేణిలో జాబ్ మేళా - Sakshi

సింగరేణిలో జాబ్ మేళా

వేగంగా ఉద్యోగ నియామకాలు
* 14, 21 తేదీల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాలకు పరీక్ష
* బదిలీ వర్కర్లకు వారంలో రీ-నోటిఫికేషన్

గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. రెండు నెలలుగా పలు ఉద్యోగాలను భర్తీ చేసిన యాజమాన్యం ఈనెల 14, 21, 28వ తేదీల్లో మరికొన్ని ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. అలాగే ఆగస్టులో క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
 
ఇక నుంచి ప్రతీ ఆదివారం పరీక్షలు
సింగరేణి సంస్థలో వేలాది ఉద్యోగాల భర్తీకి వివిధ తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేసిన యాజమాన్యం ఇక నుంచి ప్రతీ ఆదివారం ఉద్యోగాల నియామకాల రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14వ తేదీన 60 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు, 21వ తేదీన 72 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) ఉద్యోగాలు, 28వ తేదీన 67 మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఈఅండ్‌ఎం) ఉద్యోగాల కోసం కొత్తగూడెంలో రాత పరీక్ష నిర్వహించనుంది. అలాగే, జూలైలో 174 ఫిట్టర్ ట్రైనీ, 172 ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికితోడు ఆగస్టులో 474 క్లర్క్ (గ్రేడ్-2) పోస్టుల నియామకానికి కూడా రాత పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టింది.
 
మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఆర్డర్లు
సింగరేణిలో మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్)-42 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్)-18, మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్)-40, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్)-8, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ -995 పోస్టుల భర్తీకోసం యాజమాన్యం ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించింది. అదే రోజు సాయంత్రమే ఫలితాలను వెల్లడించింది. అయితే,  ఈ పరీక్షల్లో తృతీయ సంవత్సరం చదివే ఐటీఐ, డిప్లోమో, ఇతర విద్యార్థులకు కూడా అవకాశం కల్పించగా... వారి ఫలితాల వెల్లడి కోసం జూలై 31వ తేదీ వరకు వేచిచూడాలని యాజమాన్యం నిర్ణరుుంచింది. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణులై... ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా పాసైన అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను వర్తింపచేస్తూ ఆగస్టులో ఆఫీస్ ఆర్డర్లను అందజేయనుంది.
 
పెరిగిన ‘బదిలీ వర్కర్లు’
వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన నిరుద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సింగరేణిలో ‘బదిలీ వర్కర్’ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సింగరేణి ముందుకు వచ్చింది. 175 పోస్టులను భర్తీకి 4 నెలల క్రితం పదో తరగతి ఉత్తీర్ణులైన ఏజెన్సీ ప్రాంత గిరిజన యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా, సుమారు 22,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. యాజమాన్యం తాజాగా మరో 490 పోస్టులను  పెంచింది. పెంచిన పోస్టులు కలిపి వారంలో రీ-నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీరికి పరుగుపందెం నిర్వహించిన తర్వాత 1ః3 నిష్పత్తిలో పిలిచి రాత పరీక్ష నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement