సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై, అధికారుల పనితీరుపై జోగిని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు బోనం సమర్పించామని సంతోష పడుతున్నారు.. కానీ నాది నాకే సమర్పించారని చెప్పారు. బంగారు బోనం సమర్పించినా.. తాను దుఖంతో ఉన్నానని.. తన దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఈ ఏడాది దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత ద్వారా భవిష్యవాణి వినిపించారు. తనకు బంగారు బోనం వద్దని.. సంతోష బోనం సమర్పించాలని అమ్మవారు రంగంలో సూచించారు.
‘నా సన్నిధికి వస్తున్న భక్తులు దుఖంతో వస్తున్నారు. దుఖంతోనే పోతున్నారు. ఈ ఏడాది మాత్రం భక్తులు సంతోషంగా లేరు. నా భక్తులు సంతోషంగా ఉన్నారని మీరు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మాటల్లో ఉన్నంతగా చేతల్లో మాత్రం పనులు లేవు. నా బిడ్డలు, అడపడుచులందరు ఎడుపులతో ఉన్నారు. మీరు ప్రజలను ఇబ్బంది పెట్టినా.. నేను మాత్రం ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ప్రజలకు మేలు చేస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ కీడు చేస్తున్నారు. ప్రజలందరూ శాపాలు పెడుతున్నారు.
నేను ఎప్పుడు శాపం పెట్టలేదు. ప్రజలను సంతోషంగా చూసుకుంటాను. ఆ భాద్యత నాది. నా ఆశీర్వాదం అందరికి ఉంటుంది. నాకు మాత్రమే మొక్కులు సమర్పించడం కాదు. ప్రజలను సంతోషపెట్టండి. వచ్చే రోజుల్లో నా భక్తులకు ఇబ్బందులు కాకుండా చూసుకోండి. నేనెప్పుడూ న్యాయం పక్షాన నిలబడుతా. కోరినన్ని వర్షాలు ఉన్నాయి. వచ్చే రోజుల్లో వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు బాగా పండుతాయని’ అమ్మవారు భవిష్యవాణి వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment