బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ జిల్లాలో వివిధ పత్రికలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(టీడబ్ల్యూజేఎఫ్) పేర్కొంది. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్, వీబీఎన్ పద్మరాజులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డిని కలిసింది.
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయింపుపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల డీఈవో సోమిరెడ్డికి హెచ్‌యూజే తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాలు చేస్తున్న విజ్ఞప్తిని డీఈవో అంగీకరించి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ముందుగా పిల్లల ఫొటోలతో ఉన్న దరఖాస్తులను పూర్తిచేసి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయానందరావు, నవీన్, భీష్మాచారి, ఆశాలత, యశోద, నాగమణి తదితరులు ఉన్నారు.
త్వరలో కార్డుల పంపిణీ
పంజగుట్ట: హైదరాబాద్ జిల్లా పరిధిలోని పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యను అందించడానికి విద్యా శాఖ అధికారులు అంగీకరించడం అభినందనీయమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి పాలకూర రాజు తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు టీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో ఫ్రీ ఎడ్యుకేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 15న నగరంలోని తెలంగాణ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. అర్హులైన తెలంగాణ జర్నలిస్టులు తమ పిల్లల ఫొటోలతో పాటు జర్నలిస్టుల ఫొటోలు, గుర్తింపు కార్డులను తీసుకొని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయింపు
Published Sat, Sep 13 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement