
బీసీసీఐకి సంబంధించిన అంతర్గత సమాచారం మీడియాలో తరచుగా వస్తుండటం పట్ల బోర్డు కార్యదర్శి జై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు ఉద్యోగులెవరూ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడరాదని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంతోపాటు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కలిపి సుమారు 100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ‘బీసీసీఐ ఉద్యోగులు కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని తెలిసింది.
ఇది కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేయడం వల్ల బోర్డుకు సంబంధించి రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా గానీ తమకు తెలీకుండా గానీ ఎవరైనా, ఏ రూపంలోనైనా ఇలా సమాచారం బయటకు చేరవేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వేతన చెల్లింపులు కూడా లేకుండా ఉద్యోగంలోంచి తొలగిస్తాం’ అని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్‌లో జై షా పేర్కొన్నారు. అయితే ఎలాంటి సమాచారం లీక్ కావద్దంటూ అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్ కూడా ఇప్పుడు మీడియాకు లీక్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment