'బండారం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారు'
హైదరాబాద్: తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలతోపాటు వివిధ సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేసి... ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలు ఇలా వ్యవహారించడం దారుణమన్నారు.
తెలంగాణలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు 10 రోజులు కాదు.... నెలరోజులైనా తాము సిద్ధమేనని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అయినా వినకుండా ప్రతిపక్షా నేతలు ఇలా వ్యవహరించడం సబబు కాదన్నారు. విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చ జరిగితే కారణం ఎవరన్నది బయటపడుతుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ విషయం తెలిసే ప్రతిపక్ష నేతలు సభను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.