
సాక్షి, జనగామ: ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మొహం చాటేశాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం జిల్లాకు విచ్చేసిన లక్ష్మణ్‌కు ఆర్టీసీ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి నిజాం నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన త్యాగధనుల కీర్తిని నలుదిశలా చాటుతానని చెప్పిన కేసీఆర్ మజ్లిస్‌కు తొత్తుగా మారాడని విమర్శించారు.
యాదాద్రి దేవస్థానంలో దేవుడి కన్నా ఎక్కువగా కేసీఆర్ బొమ్మలు చెక్కించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని లక్ష్మణ్ మండిపడ్డారు. హిందువులు చేసిన పోరాటంతో కేసీఆర్ బొమ్మలు తొలగించారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, గుండె విజయరామారావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment