నేడు 3 కీలక ఘట్టాలు
నిమజ్జనం, తెలంగాణ ప్రజాపాలన, విమోచన దినోత్సవాలు
నగర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లు... పాతబస్తీపై ప్రత్యేక దృష్టి
అదనపు బలగాల మోహరింపు
సున్నిత, అనుమానిత ప్రాంతాల్లో మఫ్టీలో గస్తీ
సాక్షి, హైదరాబాద్: సాధారణ పరిస్థితుల్లోనే గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక ఊరేగింపు, నిమజ్జనాలను సజావుగా పూర్తి చేయడం నగర పోలీసులకు పెద్ద సవాలు. అలాంటిది ఈసారి మంగళవారం ఒకేరోజు.. హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు కీలక చెరువుల్లో నిమజ్జనాలు, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం జరగనుండటంతో పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఏడాదీ సామూహిక ఊరేగింపు, నిమజ్జనం నేపథ్యంలో ఉత్తరాది సహా వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు నగరానికి వస్తుంటారు.
వీరిలో ఆర్‌ఎస్‌ఎస్ సహా వివిధ సంస్థలకు చెందిన వారు ఉంటారు. చార్మినార్, ఎంజే మార్కెట్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వీరి ప్రసంగాలు ఉంటాయి. దీంతో పోలీసులు ఆయాచోట్ల అదనంగా జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు ప్రధాన రహదారి కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి. దీనికి తోడు ఈసారి సెపె్టంబర్ 17 పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. దీనికి ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే అవకాశం ఉంది.
ఈ రెండు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ చిక్కులు మరింత పెరుగుతాయని భావిస్తున్న పోలీసు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయనతో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ క్యాడర్ పరేడ్ గ్రౌండ్స్‌కు తరలిరానుంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా..
సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పోలీసు అధికారులు..ఆయా కార్యక్రమాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. సోమవారం రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అధికారులు విధుల్లో ఉండనున్నారు. అవసరమైన స్థాయిలో అదనపు బలగాలను రంగంలోకి దింపి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, టీజీఎస్‌ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లతో పాటు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు.
వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సివిల్, సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత, అనుమానిత ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులతో ప్రత్యేక గస్తీ, నిఘా ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం అర్ధరాత్రి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. నిమజ్జనం బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తుండగా, గురువారం నగరంలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉండటంతో దానికీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment