రాష్ట్రంలో తుగ్లక్ పాలన
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్
సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకొన్న తెలంగాణలో ఇప్పుడు తుగ్లక్ పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే నీళ్లు, నియామకాలు అని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగ నియామకాలు జరపకుండానే 31 కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే పాలన ఏ విధంగా సాగిస్తారని ప్రశ్నించారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా నాడు జిల్లాల ప్రారంభం పెట్టుకుని ఉద్యోగులను పండుగకు దూరం చేశారన్నారు.
శాస్త్రీయత ఏదీ?: పరిపాలన కోసం జిల్లాలు పెంచడం మంచిదే అయినా.. అది శాస్త్రీయంగా లేకపోవడం పైనే తమ పార్టీ స్పందిస్తోందని శివకుమార్ తెలిపారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నెల న్నర తర్వాత అధికారులను అధ్యయనం కోసం ఇతర రాష్ట్రాలకు పంపడం సమంజసంగా లేదన్నారు.గద్వాలను జోగులాంబ జిల్లాగా ప్రకటిస్తూ, అలంపూర్ మండలాన్ని వనపర్తి జిల్లాలో చేర్చడం ఏంట న్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పెట్టకుండానే గద్వాల, జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌లను జిల్లాలుగా ప్రకటించారన్నారు. నాలుగు జిల్లాల ఏర్పాటుపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదిక సమర్పించక ముందే సీఎం ఆ నాలుగింటినీ జిల్లాలుగా ప్రకటించారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ఎమ్మార్వో పేరు తొలగించి, దాని స్థానంలో తహసీల్దార్ పేరు తీసుకువచ్చారన్నారు. ఇప్పుడు కేసీఆర్ తానే తహసీల్దార్ పేరును కనుగొన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు.