కడెం, న్యూస్‌లైన్ : వర్షాకాలంలో నీటి నిల్వ కోసం కడెం ప్రాజెక్టు సిద్ధమవుతోంది. నీటి నిల్వతోపాటు జలాశయంలోకి అదనంగా నీళ్లొస్తే.. బయటకు పంపేందుకు వినియోగించే వరద గేట్లను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి ప్రాజెక్టు యంత్రాలు, గేట్ల సామర్థ్య పరిశీలనలో అధికారులు నిమగ్నమ య్యారు. వారం క్రితం ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్యాంసుందర్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు కలిసి కడెం ప్రాజెక్టు గేట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. గేట్లను పెకైత్తి వాటి పనితీరు, సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన 100 కేవీ సామర్థ్యం గల జనరేటర్ పనితీరును తెలుసుకున్నారు.
ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్ సీజన్‌లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగైదు రోజులుగా ప్రాజెక్టు వరదగేట్ల గదుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. వరద గేట్లను పైకి లేపేందుకు ఉపయోగించే గేరు బాక్సులు, యంత్రాలు, వైర్ రోప్‌లు తదితర యంత్రాలకు గ్రీసింగు పూస్తున్నారు. దీని తర్వాత కాడీ కంపౌండ్, ఆయిలింగు వంటి పనులు చేపడతారు.
ప్రాజెక్ట్‌కు ఉన్న 18 గేట్లకు ఈ పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్, జేఈ నరేందర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వరదగేట్లపై ఉన్న వీధిదీపాల మరమ్మతు కొనసాగుతోంది. రాత్రివేళ వరదగేట్లు ఎత్తే సమయంలో అవసరమైన వెలుతురు కోసం భారీ సామర్థ్యం గల లైట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, కనిష్ట స్థాయి నీటిమట్టం 675 అడుగులు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 678 అడుగుల నీటిమట్టం ఉంది.
నీటి నిల్వకు ‘కడెం’ సన్నద్ధం
Published Thu, Jun 5 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement