
కడియం.. డిప్యూటీ సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వరంగల్ లోక్‌సభ సభ్యుడు కడియం శ్రీహరి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఈ స్థానంలో ఉన్న తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కడియంకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తూ, విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మన జిల్లాకు రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యం పెరిగింది.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి సీఎం తప్పించారు. ఈ పరిణామం శ్రీహరికి అనుకూలించింది. పరిపాలనా పరంగా అనుభవం, దళిత సామాజిక వర్గం కావడంతో శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. కడియం శ్రీహరి 1994 డిసెంబరు నుంచి 2004 అక్టోబరు వరకు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర మంత్రులుగా పని చేస్తూ గతంలో పలువురు లోక్‌సభకు ఎన్నియ్యారు. లోక్‌సభ సభ్యుడు నేరుగా రాష్ట్ర మంత్రి కావడం అరుదైన విషయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి. శ్రీహరి లోక్‌సభకు రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు.
టీఆర్‌ఎస్‌లో అయోమయం
డిప్యూటీ సీఎం మార్పు అంశంపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. టి.రాజయ్యను ఈ పదవి నుంచి తప్పించడం.. వెంటనే కడియం శ్రీహరిని ఈ పదవిలో నియమించడం గులాబీ పార్టీ జిల్లా ముఖ్యనేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రుల మార్పు ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరిగే ప్రక్రియే అయినా.. ఇంత వేగంగా చేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
టీఆర్‌ఎస్ ఆవిర్భావంలో, తర్వాత కీలక సమయాల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించిన కడియం శ్రీహరి.. ఎన్నికల ముందు పార్టీలోకి రావడం ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కావడం అంతా అయోమయంగా ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. శ్రీహరికి పదవి విషయం టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యులు, కార్యకర్తలకు మింగుడుపడడం లేదు.
నేడు సన్మానం : తక్కెళ్లపల్లి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం జిల్లాకు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జిల్లాకు వస్తున్న శ్రీహరిని ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తున్నట్లు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు తెలిపారు. శ్రీహరి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జనగామ, మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్‌ఘన్‌పూర్, 2 గంటలకు మడికొండ, 3 గంటలకు కాజీపేట జంక్షన్, సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకుంటారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు హన్మకొండ ఏకశిలాపార్కులో ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు.