
సాక్షి, జనగాం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అవినీతిపరుల పార్టీగా మారిందని విమర్శించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కాంగ్రెస్ నేతలు తమపై పోటీ చేస్తారట అని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి వెళ్ళి బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరితో సయోధ్య కుదిర్చారు.
ఇద్దరితో కలిసి సమావేశానికి హాజరైన హరీష్ రావు.. ఓటుకు నోటు కేసులో పట్ట పగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. రూ. 50 కోట్లు పెట్టి టీపీసీసీ పదవిని కొనుక్కున్నాడని ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డే అంటున్నాడని మండిపడ్డారు. ఐదు కోట్లు, పదేకరాల భూమికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.
కాంగ్రెస్‌కు సగం సీట్లలో అభ్యర్థులు లేరని అన్నారు హరీష్ రావు. పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మారుపేరని, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఏడిపిస్తుందని విమర్శించారు. కడియం శ్రీహరి, రాజయ్య నాయకత్వంలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే..
Comments
Please login to add a commentAdd a comment