అధికారులకు కడియం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు సరిగా లబ్ధి చేకూరేలా విధానాల్లో మార్పు లు చేయాలని ఆయా శాఖల అధికారులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, వాటి వల్ల అందుతున్న లబ్ధి తీరును పరిశీలించి మరింత మెరుగైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. వచ్చే నెల 8వ తేదీలోగా జరిగే సమావేశానికి వాటిని తీసుకురావాలని సూచించారు.
ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రశేఖర్‌రావు సంక్షేమ పథకాలను సమీక్షించిన సందర్భంగా ఆయా శాఖల మంత్రులు సమావేశమై పథకాల పురోగతిపై చర్చించి మెరుగైన ఫలి తాల కోసం సూచనలతో రావాలని చెప్పడంతో శని వారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం చాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం జరిగింది.
పథకాల ద్వారా లబ్ధి పొందేవారి ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాం తంలో రూ.60 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు, పట్టణాల్లో రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు పెంపు, వయోపరిమితి పెంపు ప్రతిపాదనలపై చర్చ జరిగింది. హాస్టళ్లల్లో కాస్మోటిక్ చార్జీలను అబ్బాయిలకు రూ.150, అమ్మాయిలకు రూ.200 చొప్పున పెంచాలని ఆదేశించారు. జిల్లాకు 2 రెసిడెన్షియల్ స్కూళ్లు, 2 రెసిడెన్షియల్ హాస్టళ్లు నిర్మించాలని నిర్ణయించారు.
సరిగ్గాచేయండి.. లేకపోతే వేరే శాఖల్లోకి వెళ్లండి
సంక్షేమ శాఖల్లో ఆయా వర్గాలకు మేలు చేసేలా చిత్తశుద్ధితో పని చేయాలని, లేకపోతే వేరే శాఖల్లోకి వెళ్లాలని ఆయా శాఖల అధికారులనుద్దేశించి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆశించిన రీతి లో ఆయా పథకాలు అమలు కావడం లేదని, కొంతమేర అధికారుల అలసత్వం కనిపిస్తోందన్నారు.