సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో నెలకొల్పనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కునకు అక్టోబరు 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేస్తారని, అదే రోజు వరంగల్ ఓఆర్‌ఆర్, కాజీపేట ఆర్వోబీ పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ నాలెడ్జ్ (టా స్క్) రీజనల్ కార్యాలయాన్ని శనివారం హన్మకొండలో కేటీఆర్ ప్రారంభించారు. కాగా, టెక్స్‌టైల్ పార్కు వద్ద 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్న పైలాన్ నమూనాను మంత్రి కేటీఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంయుక్తంగా ఆవిష్కరించారు.
రూ. 25 కోట్లతో ఐటీ టవర్
అత్యుత్తమ ప్రతిభ గల ఓరుగల్లు విద్యార్థులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించినట్లు నిట్, వరంగల్‌లలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ చెప్పారు. మడికొండలోని ఇంక్యూబేషన్ సెంటర్‌లో రూ.25 కోట్లతో మరో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబరు 22న దీనికి శంకుస్థాపన చేస్తామన్నారు. టాస్క్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్, మహీంద్రా ప్రైడ్, మేథా ఇంజనీరింగ్, క్రిష్ణమాచారి ఫౌండేషన్‌కు చెందిన ఇంగ్లిష్ స్ట్రోక్స్ సంస్థతో అవగాహన ఒప్పందం (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్, ఎంఓయూ) కుదుర్చుకున్నారు.
టెక్స్‌టైల్ పార్క్ స్థల పరిశీలన
వరంగల్ రూరల్ జిల్లా సంగెం–గీసుకొండ మండలాల పరిధిలో నిర్మించనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు స్థలాన్ని శనివారం కడియం, కేటీఆర్‌లు పరిశీలించారు. ఫార్మ్ టూ ఫ్యాషన్ అనే లక్ష్యంతో వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు వల్ల 1.20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్కిల్, సెమీ స్కిల్, నాన్ స్కిల్‌లుగా మూడు రకాల ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. శంకుస్థాపన రోజే 12 కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నామన్నారు.
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో తిర్పూర్ తరహాలో టెక్స్‌టైల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్సిస్టిట్యూషన్ (నిఫ్ట్) సెంటర్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. 22న జరగనున్న టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. దాదాపు 45 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున బహిరంగ సభకు రెండు లక్షల మంది వచ్చేలా జనాలను సమీకరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment