వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు | Textile Park in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు

Published Wed, Jul 23 2014 3:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

Textile Park in Warangal

 వరంగల్ : వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి తమిళనాడు తరహాలో పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో జిల్లాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. సీఎం హామీ జిల్లాలో పత్తి ఆధారిత పరిశ్రమ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందని జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రత్యేక ఇండస్ట్రియల్ పాలసీని రూపొందించడం సత్వరం పూర్తిచేసి వెంటనే పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన నూతన పారిశ్రామిక విధాన రూపకల్పన సమావేశానికి హాజరైన జిల్లా ప్రతినిధులకు సీఎం భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కోశాధికారి మంజు లాహోటి, నాగభూషణం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా పారిశ్రామికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించగానే సీఎం స్పందించి స్పష్టమైన హామీలిచ్చారని రవీందర్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమలపై గతంలో విధించిన విద్యుత్ జరిమానాలు ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు.

 పత్తి, సీడ్‌పై విధిస్తున్న రెండు మార్కెట్ సెస్సుల్లో ఒకటి తొలగిస్తామని, ఇతర రాష్ట్రాలకు ముడిపత్తి వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా ప్రోత్సాహం, సహకారం లేకుండా ఈ పరిశ్రమ జిల్లాలో వేళ్లూనుకోవడం కష్టమని తేల్చిచెబుతున్నారు.

 ఈ నేపథ్యంలో కొత్త సర్కార్ ఇచ్చిన హామీ అమలు కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక్కడ అనువైన భూమి, వాతావరణం, ముడిసరుకు, నిరుద్యోగులు, నిపుణులైన కార్మికులు, రోడ్డు, రైలు మార్గాలు ఉన్నందున టెక్స్‌టైల్ ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేస్తుందనే ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 14 టీఎంసీ, 90 పాత జిన్నింగ్ మిల్లులున్నాయి. రోజుకు 80వేల బస్తాల మేరకు ముడిపత్తి జిన్నింగ్ చేసే సామర్థ్యం ఉంది. 2,75వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని పండిస్తున్నారు. 48లక్షల క్వింటాళ్ళ పత్తి దిగుబడి వస్తోంది. సర్కార్ నిర్ణయం అమలైతే ఇక్కడి పత్తిని ఇక్కడే సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement