సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలో గతంలో ఏ ప్రాజెక్టుల పరిధిలో వినియోగించని మోటార్లకు తొలిసారి గోదావరి నీటితో పరీక్ష చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్యాకేజీ–6లోని 124 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న భారీ మోటార్లకు బుధవారం ఉదయం 11 గంటలకు వెట్‌రన్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మోటార్ల స్విచ్ ఆన్ చేస్తారు. సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
కాళేశ్వరంలో తొలి ఎత్తిపోతలు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ–6లో ఈ నెల 17 నుంచి ట్రయల్ రన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎల్లంపల్లిలో ఉన్న 8.46 టీఎంసీల నీటిలో 0.25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్‌రన్ నిర్వహించారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యాసంతో ఉన్న జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6లోని సర్జ్‌పూల్‌ను నింపి లీకేజీలను పరిశీలించారు. మంగళవారం మరోసారి సర్జ్‌పూల్‌ను 138 మీటర్ల లెవల్ వరకు నింపి డ్రాఫ్ట్‌ట్యూబ్ గేట్ల ద్వారా లీకేజీలను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లీకేజీలు లేకపోవడంతో బుధవారం మోటార్ల వెట్‌రన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నందిమేడారం పంప్‌హౌజ్‌లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్ధ్యం గల 7 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో పంపు 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామరŠాధ్యన్ని కలిగి ఉన్నాయి. గతంలో ఈ స్థాయి మోటార్లను ఏ ఎత్తిపోతల పథకంలోనూ వినియోగించలేదు.
ఈ 7 మోటార్లలో ఇప్పటికే 4 సిధ్దమయ్యాయి. మరో 3 జూన్ నాటికి పూర్తవుతాయి. వెట్‌రన్‌లో భాగంగా బుధవారం సర్జ్‌పూల్‌లో నీటిని 138 మీటర్ల నుంచి మోటార్ల ద్వారా ఎత్తిపోస్తారు. సుమారు 105 మీటర్ల ఎత్తుకి నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. సర్జ్‌పూల్‌లో ఉన్న నీటితో ప్రతి మోటార్‌ను 20 నుంచి 30 నిమిషాలు రన్ చేసి చూస్తారు. ప్రస్తుతానికి సిధ్దంగా ఉన్న 4 పంపులకు విడివిడిగా వెట్‌రన్ నిర్వహిస్తారు. మోటార్లు ఎత్తిపోసే నీరు నంది మేడారం రిజర్వాయర్ వద్ద నిర్మించిన డెలివరీ సిస్టర్న్ నుంచి పైకి వచ్చి నంది మేడారం చెరువులోకి చేరతాయి. ఒక పంపు నుంచి వచ్చే నీరు ఒక డెలివరీ సిస్టర్న్ ద్వారా పైకి వస్తుంది. అన్ని పంపులు ఒకేసారి తిరుగుతున్నప్పుడు 7 డెలివరీల నుంచి నీరు బయటకు వస్తుంది. ప్రస్తుతానికి 4 డెలివరీల నుంచి నీటి విడుదల జరగనుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే తర్వాతి క్రమంలో ప్యాకేజీ–7లో ఉన్న జంట టెన్నళ్ల ద్వారా నీటిని విడుదల చేసి ప్యాకేజీ–8 పంప్‌హౌజ్‌లో ట్రయల్‌రన్ నిర్వహిస్తారు. అయితే ప్యాకేజీ–7లో ఇంకా 800 మీటర్ల మేర టన్నెళ్లకు లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితేనే ట్రయల్ రన్ నిర్వహించడం సాధ్యపడుతుంది. ఇక ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్ధ్యం గల 7 మోటార్లు ఉండగా ఇక్కడ 5 సిధ్దమయ్యాయి. వీటికి మే నెలాఖరులో వెట్‌రన్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment