సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండో మోటార్ పంపు డ్రై రన్ సైతం విజయవంతం అయింది. ఇప్పటికే ఓ పంపు డ్రై రన్ విజయవంతం కాగా.. మరో పంపు సైతం విజయవంతమైందని నీటి పారుదల శాఖ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ప్రకటించారు. రెండో మోటార్ స్పీడ్‌ను క్రమంగా పెంచుతూ పూర్తి స్థాయిలో పనిచేసేలా ఈ స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. మోటార్ ఆర్‌పీఎం (రివల్యూషన్ పర్ మినిట్) సామర్థ్యం 214.5 ఆర్‌పీఎంలు కాగా అది 10 నిమిషాల్లోనే నిర్ణీత స్పీడ్‌ను అందుకుందని వివరించారు. ఈ డ్రై రన్‌ను ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వెంకట రాములు, ఈఈ శ్రీధర్‌తో పాటు బీహెచ్‌ఈఎల్, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు పర్యవేక్షించారు.
ఈ పంపు డ్రై రన్ విజయంతం కావడంపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, ట్రాన్స్‌కో, మేఘా, బీహెచ్‌ఈల్ ప్రతినిధులను అభినందించారు. ప్యాకేజీ–8లో రెండో పంపు సైతం సిద్ధం కావడంతో ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6లోని మోటార్ల డ్రై రన్, ప్యాకేజీల–7లో మిగిలిన టన్నెల్ నిర్మాణ పనులు ముగించడం కీలకంగా మారాయి. ప్యాకేజీ–6లో మోటార్లు సిద్ధంగా ఉన్నా, వాటికి విద్యుత్‌ను అందించే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఇంకా సిద్ధం కావాల్సి ఉంది. అది పూర్తయితే ఈ వారం, పది రోజుల్లోనే డ్రై రన్ జరిగే అవకాశం ఉం ది. ఇక ప్యాకేజీ–7లో టన్నెల్ పనులు చివరి దశకు చేరుకుంటుండగా, లైనింగ్ పనులు మిగిలి ఉంటా యి. ఈ పనులు పూర్తయితే వచ్చే నెల నుంచే ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్‌కు అటునుంచి మిడ్‌మానేరుకు తరలించే అవకాశంఉంది.
Comments
Please login to add a commentAdd a comment