
కాళేశ్వరా.. కష్టాలు తీరేనా?
మంథని/మహదేవపూర్: త్రివేణి సంగమ క్షేత్రం కాళేశ్వరం అభివృద్ధిలో ఆమడదూరంలో ఉంది. క్షేత్రంపై అధికారులు, పాలకులు శీతకన్ను వేస్తుండడంతో నిర్లక్ష్యానికి గురవుతోంది. వచ్చే జూలైలో జరుగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పుష్కరాల పుణ్యమా అని కాళేశ్వరంలో కష్టాలు తీరేనా అని భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా ఆలయానికి ప్రతిరోజు సుమారు రెండు లక్షల మంది మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారనేది ఇటు ప్రభుత్వం అటు దేవాదాయ శాఖ వర్గాల అంచనా. ఇంతమంది భక్తులకు సరిపడా కనీస సౌకర్యాలు ప్రస్తుతం ఇక్కడ లేవు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల ద్వారా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపితే రూ.37 కోట్లకు మాత్రమే అనుమతి లభించింది. ఈ అరకొర నిధులతో ఏ మేరకు అభివృద్ధి పనులు చేపడుతారనేది సమీక్ష సమావేశంలో కలెక్టర్ తీసుకునే నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది.
బోరు నీటితో అభిషేకం
గోదావరి, ప్రాణహిత, సరస్వతి(అంతర్‌వాహిని) నదుల సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై కొలువైన కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివార్లకు నిత్యం బోరు నీటితోనే అభిషేకం చేస్తున్నారు. గోదావరి నుంచి ఆలయానికి నీటి సరఫరా లేకపోవడంతో ఆలయ అర్చకులు తప్పసరి పరిస్థితుల్లో బోరు నీటిని వినియోగిస్తున్నారు. ఈ సమస్య మొదటి నుంచి అర్చకులను, భక్తులను ఇబ్బంది పెడుతున్నా పరిష్కారం కావడం లేదు. కేవలం రూ.5లక్షలు వెచ్చించి గోదావరి నుంచి పైపులైను ఏర్పాటు చేస్తే నదీ జలంలో స్వామివారికి అభిషేకం చేసే భాగ్యం కలుగుతుంది.
భక్తులకు నీడ కరువే..
కాళేశ్వరం ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు వచ్చే భక్తులకే సరిపడా సౌకర్యాలు లేవు. ఇక పన్నెడు రోజుల పాటు జరిగే పుష్కరాల్లో ప్రతి రోజు వచ్చే రెండులక్షల మందికి సరిపడా వసతులు ఎలా అనేది ప్రశ్న. జాతరకు వచ్చే భక్తులు ఆలయ ఆవరణలోని చెట్లు చేమల నీడన సేద తీరాల్సిందే. ఆలయంలో ప్రస్తుతం టీటీడీ వారు నిర్మించిన సత్రంలో 15 గదులకు 5గదులు మాత్రమే భక్తుల కోసం సిద్ధంగా ఉన్నాయి. రాజరాజేశ్వర స్వామి వారి సత్రంలో 20 గదులు ఉన్నప్పటికీ అనేక గదులు విధులకు వచ్చే వివిధ శాఖలకే కేటాయించడం జరుగుతోంది.
సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఉన్న 7గదులు వీఐపీల కోసమే కేటాయిస్తున్నారు. ఇవికాకండా మరో మూడు వసతిగృహాలు ఉన్నప్పటికీ అవి దాతల సహాయంతో నిర్మించినవి కావడం వల్ల దాతలు వస్తే వారికే ఆయా వసతిగృహాలను కేటాయిస్తారు. భక్తులకు రాజరాజేశ్వర స్వామి సత్రంలో ఉన్న రెండు హాళ్లు, ఆలయ ఆవరణలోని మూడు రేకుల షెడ్లు మాత్రమే నీడనిస్తాయి.
పుష్కరాలు వర్షాకాంలో వస్తుండటంతో భక్తులకు సరిపడా డార్మెటరీలు నిర్మించాల్సి ఉంది. వీటితో పాటు ఆలయ ఆవరణతో పాటు గోదావరి ప్రాంతంలో స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉంది. పుష్కరాల నిధుల్లో ఏడు డార్మెటరీ భవనాల కోసం రూ.28లక్షలకు ప్రతిపాదనలు పంపగా వాటికి అవకాశం లభించలేదు. డార్మెటరీ భవనాలకు నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.
స్నాన ఘట్టాలు పెంచాలి
ప్రస్తుతం గోదావరి నది ఒడ్డుపై సుమారు వంద మీటర్ల వరకే స్నానఘట్టాలు నిర్మించి ఉన్నాయి. వర్షాకాలం పుష్కర భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఘాట్‌కు రెండు వైపులా సుమారు మూడు వందల మీటర్ల వరకు స్నానఘట్టాలను నిర్మించాల్సి ఉంది.
శ్రాద్ధమండపాలు నిర్మించాలి
కాళేశ్వరంలో పిండప్రదానాలు ఎక్కువగా చేస్తుంటారు. కాని గోదావరి తీరంలో శ్రాద్ధమండపాలు అందుబాటులో లేవు. పుష్కరాల్లో ఎక్కువ మంది భక్తులు పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీ. దీంతో ఇక్కడ మూడు శ్రాద్ధ మండపాలు నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇరుకు రోడ్లు, పార్కింగ్ కరువు
కాళేశ్వరం వచ్చే భక్తులు బస్టాండ్ నుంచి గోదావరి నది వరకు వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల శివరాత్రి, ఇతర జాతరల సమయాల్లోనే భక్తులకు అనేక ఇబ్బందులు కలుగుతూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్టాండ్ నుంచి గోదావరి వరకు గల రోడ్డును ప్రస్తుతం ఉన్న దానికంటే రెట్టింపుగా నిర్మించాల్సి ఉంది. రోడ్డుతో పాటు వాహనాల పార్కింగ్ కోసం స్థలం లేకపోవటం కారణంగా సాధారణ భక్తుల వాహనాలు గోదావరి నదికి చాలా దూరంలో నిలిపివేస్తున్నారు. వీఐపీలు వారి బంధువుల వాహనాలకు గోదావరి వరకు అనుమతి ఇస్తున్నారు. ఈ కారణంగా సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల పార్కింగ్ గోదావరి ప్రాంతంలో కాకుండా గ్రామం మొదట్లోనే ఏర్పాటు చేయాలి.
పది గంటలే విద్యుత్ సరఫరా
ఆలయంతో పాటు కాళేశ్వరం బస్టాండ్ నుంచి గోదావరి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. పుష్కరాల సమయంలో రాత్రి పగలు ఆలయం తెరిచి ఉండటం, పుష్కర స్నానాలు ఆచరించటానికి వచ్చే భక్తులు ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం క్షేత్రంలో కేవలం పది గంటలే విద్యుత్ సరఫరా జరుగుతుండగా, 24 గంటలు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలి. ఆలయంలోకి వెళ్లే భక్తులకు క్యూలైన్ల నిర్మించి వాటిపై ఫైబర్ షెడ్లు ఏర్పాటు చేయాలి. సాధారణ సమయాల్లోనే భక్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూస్తున్న అధికారులు పుష్కర సమయంలో వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఎన్నో ఏర్పాట్లను చేయాల్సి ఉంది. లేకుంటే పుష్కర భక్తులకు అష్టకష్టాలు తప్పవు.