
కల్లు సేవించి పలువురికి అస్వస్థత
చేగుంట : కల్లు సేవించి పలువురికి అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని భీంరావుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. భీంరావుపల్లి గ్రామంలో వారం రోజులుగా దుర్గమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించారు. పూజల సందర్భంగా గ్రామంలో కల్లు తాగడం మానేశారు. శనివారం జాతర ఉత్సవాలు ముగియడంతో ఆదివారం గ్రామంలో చాలా మంది కల్లు దుకాణానికి వెళ్లి కల్లు సేవించారు. ఆదివారం రాత్రి నుంచి కల్లు తాగిన వారంతా మత్తులోకి జారుకున్నారు.
సోమవారం ఉదయం వరకు వారు మత్తు నుంచి తేరుకోక పోగా సోమవారం ఉదయం కల్లు తాగిన వారికి సైతం ఎక్కువ మత్తు ఆవహించింది. వారి ప్రవర్తనలో మార్పుతో పాటు అచేతనంగా కల్లు దుకాణం సమీపంలోనే పడి పోవడంతో స్థానికులు వారిని నార్సింగి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన లో 50 సంవత్సరాలు దాటిన వృద్ధులంతా అస్వస్థతకు గురైనారు.
భీంరావుపల్లి గ్రామంలో రెడ్డిపల్లి నుంచి కల్లును విక్రయిస్తుండగా కల్తీ కల్లు సేవించడంతోనే గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని ప్రజలు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ సీఐ యశ్వంత్ గ్రామానికి చేరుకుని బాధితుల వివరాలను సేకరించారు. అనంతరం కల్లు శ్యాంపిల్స్‌ను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.