
‘పెళ్లిచూపులు’ బృందానికి ఎంపీ కవిత అభినందనలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్న పెళ్లిచూపులు సినిమా బృందాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందించారు.64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చలనచిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే– డైలాగ్స్ కేటగిరీల్లో రెండు అవార్డులు పెళ్లిచూపులు సినిమాను వరించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డులను సినిమా బృందం అందుకుంది. కాగా, పెళ్లిచూపులు బృందం సభ్యులు ఎంపీ కవితను గురువారం కలిశారు.
ఈ సందర్భంగా వారికి ఆమె అభినందనలు తెలిపారు. చిత్రం నిర్మాతలు యశ్ రంగినేని, రాజ్ కందుకూరితో పాటు చిత్ర దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, వర్ధన్ దేవరకొండ, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, అభయ్ బేచిగంటి కవితను కలిసిన వారిలో ఉన్నారు. యూకే ఎన్నారై అయిన యశ్ రంగినేనికి పెళ్లిచూపులు తొలి సినిమా. దర్శకుడు తరుణ్ భాస్కర్‌కూ మొదటి సినిమా కావడం విశేషం. ఎంపీ కవిత మాట్లాడుతూ... కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, సందేశాత్మక సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని అన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.