డిసెంబర్ ఆదాయం అదుర్స్!
- రాష్ట్ర వనరుల ద్వారానే రూ. 3 వేల కోట్లకుపైగా ఆదాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఆదాయం ఆశించిన దానికంటే అధికంగా వచ్చింది. రూ. 3 వేల కోట్లకుపైగా సొంత ఆదాయ వనరుల నుంచి లభించింది. పొరుగు రాష్ట్రంతో పోలిస్తే ఈ నెలలో ఆదాయం పెరగడం గమనార్హం. 2014 సంవత్సరం చివరలో ఆదాయం పెరగడంతో.. ఆర్థిక సంవత్సరం వచ్చే మూడు నెలల్లో ఆదాయం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే రవాణా శాఖ ఆదాయం మాత్రమే కాస్త తగ్గింది.
రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే యత్నాల్లో తలమునకలైంది. మొన్నటి వరకు వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో.. దానిపై సమీక్ష పెద్దగా జరగలేదు. దీనితో వచ్చిన ఆదాయమే బాగా ఉందనే ఉద్దేశంలో ఉన్నారు. నవంబర్‌లో ఈ ఆదాయం రూ. 2 వేల కోట్లకు దిగువకు పడిపోవడంతో ఈసారి ఆదాయాన్ని పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల వసూళ్లలోని లోపాలను సరిచేసుకుంటే.. ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ప్రధాన విభాగాలైన వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, గనుల ఆదాయంతో పన్నేతర ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుంది. గత నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే రూ. 22 వేల కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం.
డిసెంబర్‌లో వచ్చిన ఆదాయం విభాగాల వారీగా చూస్తే వాణిజ్యపన్నులు రూ. 2, 272 కోట్లు, మద్యం రూ. 205 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రూ. 233 కోట్లు, రవాణా రూ. 170 కోట్లు, గనులు రూ. 52 కోట్లుగా ఉంది. అలాగే పన్నేతర ఆదాయం రూ. 100 కోట్లకు పైగానే లభించినట్లు తెలిసింది. అయితే ప్రతి నెలా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్ల నుంచి రూ. 2,700 కోట్ల మేరకు ఉంటోంది. కేంద్రం వసూలు చేసే పన్నుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ఈ మధ్య కాలంలో సకాలంలోనే వస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన మొదటి 2-3 నెలలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఏపీ ప్రభుత్వంలోనే జమకావడం విదితమే.