సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తున్నందున అధికారులు స్థానికంగా ఉండి, అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈమేరకు వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై సీఎస్ ఎస్.కె.జోషితో సీఎం మాట్లాడారు. తీవ్ర ప్రభావం ఉన్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో ఏడుగురు సీనియర్ అధికారులు జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు జ్యోతి బుద్ధప్రకాశ్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లకు వికాస్‌రాజ్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు బి.ఆర్.మీనా, జగిత్యాల, సిరిసిల్లలకు సందీప్ సుల్తానియా, వరంగల్ అర్బన్, జనగామకు శివశంకర్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు రాహుల్ బొజ్జ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సురేశ్ చందా ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment