తేడా వస్తే మరో యుద్ధానికి సిద్ధం: కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్తో తమ పార్టీ విలీనంపై తగిన సమయంలో స్పందిస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే విలీనంపై ఆలోచిస్తామన్నారు. 13 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నామని కాంగ్రెస్లో ఎందుకు విలీనం కావాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. విలీనంపై మాట్లాడానికి ఇది తగిన సమయం కాదన్నారు.
హైదరాబాద్పై ఎలాంటి కొర్రీని అంగీకరించబోమని పునరుద్ఘాటించారు. తేడా వస్తే మరో యుద్ధానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణతో కేంద్రం వ్యవహరించాలన్నారు. తెలంగాణకు సర్వాధికారాలు ఉండాలన్నారు. జీఓఎంకు తమ పార్టీ తరపున నివేదిక ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాని, సోనియా గాంధీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు తాను సీఎం కాబోనని స్పష్టం చేశారు.
భారతదేశంలో ఎజెండా లేకుండా నిరాహార దీక్ష ఘనత చంద్రబాబుదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సమన్యాయం అంటే ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తమ పార్టీ బృందాలను పంపుతున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 'అభయ'ను ఘటనను ఆయన ఖండించారు. ఇటువంటి పురనావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.