సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రాన్ని వాన మళ్లీ ముసురుకుంది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా రికార్డు స్థాయిలో కురిసిన వర్షం.. ఐదు రోజులు గడిచిందో లేదో మళ్లీ మొదలైంది. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతుండగా.. శుక్రవారం పొద్దంతా ముసురు కొనసాగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలుచోట్ల మాత్రం భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఏకంగా 21.1 సెంటీమీటర్ల అతిభారీ వర్షం నమోదైంది. జనగామ జిల్లా దేవరుçప్పులలో 21.03, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 15.68 సెంటీమీటర్ల వాన పడింది.
రెండింతల కన్నా ఎక్కువ వాన
నైరుతి సీజన్‌లో సాధారణంగా జూలై 22 నాటికి 29.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి ఇదే సమయానికి ఏకంగా 58.50 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అంటే కురవాల్సిన దానికంటే రెండున్నర రెట్లు ఎక్కువ పడినట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది.
మరో రెండు రోజులు వానలు
ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆరు జిల్లాలు ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబుబాబాద్, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
అప్రమత్తంగా ఉండాలి
వారం కిందటి వరకు కురిసిన కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. దీనితో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండిపోయి ఉండటం, వాగుల్లో ప్రవాహాలు కొనసాగుతున్నాయి. నదుల్లోనూ గణనీయంగా వరద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వానలతో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టి, పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొంది. రహదారులపై నీళ్లు నిలవడం, విద్యుత్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో.. ఆయా శాఖలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఉమ్మడి ఖమ్మంలో పొద్దంతా వాన
ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. పలు మండలాల్లో వాగుల్లో ప్రవాహం పెరిగి కాజ్‌వేలు, రహదారులు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ములకలపల్లి, గుండాల తదితర మండలాల్లో వాన ఎక్కువగా పడింది. ములకలపల్లి మండలం ముర్రేడు, ఊరవాగు, పాములేరు వాగుల్లో వరద పోటెత్తింది. కమలాపురం శివారులో కాజ్‌వేపై వరద ప్రవహించడంతో సాయంత్రం ఇళ్లకు తిరిగివెళ్తున్న విద్యార్థులను స్థానికులు తాళ్ల సాయంతో దాటించారు.
వికారాబాద్‌లో పొంగిన వాగులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే దారిలో బాచారం బ్రిడ్జి వద్ద వాగు ఉధృతితో రాకపోకలు నిలిపేశారు. జిల్లాలో పలు వాగులు, రైల్వే వంతెనల వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ధారూరు మండలం ఎబ్బనూర్ వాగు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చేవెళ్ల, మొయినాబాద్, గండిపేట్ ప్రాంతాల్లో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి.
మానుకోటలో కుండపోత
మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. దంతాలపల్లి, నెల్లికుదురు, నర్సింహులపేట మండలం కొమ్ములవంచ, పెద్దనాగారం గ్రామాల్లో అతిభారీ వర్షం నమోదైంది. శుక్రవారం పొద్దున వర్షం పెద్దగా లేకపోవడం.. మధ్యాహ్నానికి భారీగా కురవడంతో ఒక్కసారిగా వాగుల్లో ప్రవాహం పెరిగింది. మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు పట్టణాల నుంచి పరిసర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు వాగులు, వరద ప్రవాహం దాటి ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. ఆకేరు, మున్నేరు వాగుల వరదతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సింహులపేట గ్రామం పెద్దచెరువు అలుగు ఉధృతంగా పారడంతో.. ఆ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన సట్ల భిక్షం అనే వ్యక్తి నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే గుర్తించి రక్షించారు.
►జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ ప్రధాన రహదారి జలమయమైంది. చీటూర్ గ్రామానికి చెందిన 14 మంది కూలీలు కన్నాయపల్లిలో వరి నాట్లు వేసేందుకు వెళ్లి గోపువాగు, చీటూర్ వాగు మధ్య శ్మశాన వాటికలో చిక్కుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి నుంచి పసర వెళ్లే మార్గంలోని కొండపర్తి సమీపంలో రోడ్డుపై వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి.
వాగుల్లో చిక్కుకున్న స్కూల్ బస్సులు
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన విద్యార్థులు శుక్రవారం ఉదయం తొర్రూరులోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం స్కూల్ బస్సులో తిరిగి ఇళ్లకు బయలుదేరారు. అయితే ఉదయం నుంచి కురిసిన భారీ వర్షంతో కొమ్ములవంచ గ్రామ శివారులోని కొచ్చెర్రు వాగు పొంగి ప్రవహిస్తోంది. డ్రైవర్ ఆ ప్రవాహాన్ని అంచనా వేయకుండా ముందుకు వెళ్లడంతో.. వాగు మధ్యలోనే స్కూల్ బస్సు చిక్కుకుంది. ఇది తెలిసిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని.. బస్సులోనుంచి పది మంది విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు.
►ఇక తొర్రూరు నుంచి పెద్దముప్పారం గ్రామానికి వెళ్తున్న మరో స్కూల్ బస్సు పాలేరు వాగులో చిక్కుకుంది. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని.. 20 మంది విద్యార్థులను బయటికి తీసుకువచ్చారు.
►దాట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల చుట్టూ నీరు చేరడంతో విద్యార్థులు తాటి మొద్దుల సాయంతో బయటికి వచ్చారు.
హైదరాబాద్‌లో కుండపోత
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వాన ముంచెత్తింది. శుక్రవారం పొద్దున మొదలైన వర్షం అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా 8–11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా గాజులరామారం, హఫీజ్‌పేట్‌లలో 11.1 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. జీడిమెట్ల, బాలానగర్, అంబేద్కర్ భవన్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకుపైగా, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, ఆర్సీపురం, మాదాపూర్‌లలో 9 సెంటీమీటర్ల వరకు కురిసింది. దీంతో జన జీవనం స్తంభించింది. రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే కనిపించాయి.
పలు ప్రాంతాల్లో రోడ్లపై మీటరులోతు వరకు వరద పారింది. పలు చెరువులు, కుంటలు ఉప్పొంగాయి. సుమారు 200కు పైగా బస్తీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో పలు కాలనీల వాసులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ప్రధాన రహదారులపై నీటి ప్రవాహంతో వంద కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లతోపాటు నగరం నడిమధ్యన ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండల్లా మారాయి.
అంతా అలర్ట్‌గా ఉండాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మళ్లీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. వరద పెరిగే పరిస్థితి ఉంటే తక్షణమే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహం పెరిగే అవకాశమున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రమత్తంగా ఉండి.. నిరంతరం పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఇక గత వారం వరదల్లో కడెం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం పంపుహౌజ్‌లకు వాటిల్లిన నష్టం వివరాలపై ఆరా తీసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment