సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర అవసరాల వస్తువుల కోసం బయటకు వెళ్లేందుకు కుటుంబానికి చెందిన ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతించనున్నట్టు చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఇదే పట్టుదల చూపెట్టాలి..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూకు తెలంగాణ ప్రజలు అద్భుతంగా స్పందించారని తెలిపారు. ప్రపంచ మానవాళికి తెలంగాణ ఒక గొప్ప మార్గదర్శకంగా నిలిచిందన్నారు. చప్పట్లతో అద్భుతంగా సంఘీభావ సంకేతాన్ని, ఐక్యతను, విజ్ఞతను చాటిచెప్పిన తెలంగాణలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణలో ఆదివారం మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరందరు విదేశాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా సోకినవారి సంఖ్య 26కు చేరిందన్నారు. స్థానికంగా ఒక్కరికే కరోనా సోకిందని వెల్లడించారు. ప్రస్తుతం అందరు క్షేమంగా ఉన్నారని.. చికిత్స కొనసాగుతోందని తెలిపారు. హై లెవల్ కమిటీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించిందన్నారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో.. విదేశాల నుంచి తెలంగాణకు ఎవరూ వచ్చే అవకాశం లేదన్నారు. ఇక్కడ ఉన్నవారి నుంచి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోని స్థానికుల మధ్య వైరస్ వేగంగా వ్యాపించడం లేదని తెలిపారు. మనం కోసం మనం, జనం కోసం జనం, అందరి కోసం అందరం ఈరోజు చూపెట్టిన పట్టుదలనే మార్చి 31వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
రేషన్‌కార్డుపై ఉచిత బియ్యం, రూ. 1500
అత్యవసర పనులపై బయటకు వెళ్లినా మనిషికి, మనిషికి మధ్య 3 ఫీట్ల దూరం పాటించాలన్నారు. నెల రోజులకు సరిపడేలా తెల్లరేషన్ కార్డుదారులకు ఒకరికి 12 కిలోల బియ్యం చొప్పున రేషన్ బియ్యం ఉచితంగా అందజేస్తామన్నారు. ఇతర సరుకులు కొనుగోలు కోసం తెల్లరేషన్‌కార్డుపై రూ. 1500 ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యాలయాలకు రానవసరం లేదన్నారు. అయితే అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు 100 శాతం విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మిగిలిన విభాగాలకు చెందిన 20 శాతం ఉద్యోగులు విధులకు హాజరైతే సరిపోతుందని స్పష్టం చేశారు. పరీక్ష పేపర్ల వాల్యూయేషన్ కూడా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. టీచర్లు కూడా స్కూళ్లకు రానవసరం లేదన్నారు.
మన వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే..
కార్మికులు ఈ వారం రోజులు పాటు పనిచేయకున్నా యాజమాన్యం వేతనం ఇవ్వాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలను కూడా మూసివేస్తునట్టు చెప్పారు. గర్భిణీల జాబితాను సిద్ధం చేస్తున్నామని.. వారి డెలివరీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలు కొనసాగుతాయని చెప్పారు. అత్యవసరం కానీ శస్త్ర చికిత్సలు వాయిదా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మన వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. మార్చి 31వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్నీ బంద్ చేస్తున్నట్టు చెప్పారు. ఐదుగురు కంటే ఎక్కువ ఎవరూ రోడ్డు మీదకు రావొద్దన్నారు. తెలంగాణకు ఉన్న అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నామని ప్రకటించారు. కేవలం అత్యవసర సరుకులు తెచ్చే గూడ్స్ వాహనాలకు మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని తెలిపారు.
ఆషామాషీగా తీసుకోవద్దు..
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మాత్రమే బయట తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్, ఎల్‌పీజీ గ్యాస్ సిబ్బందికి కూడా సేవలు అందించడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఇటలీలో కరోనా మహమ్మారి బారినపడి ప్రతి రోజు వందల మంది ప్రజలు చనిపోతున్నారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులు రావొద్దంటే మనకు మనమే నియంత్రణ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇది దు:ఖ సమయమని.. ఎవరూ దీనిని ఆషామాషీగా తీసుకుని బయట తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల నియంత్రణ ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది. విదేశాల నుంచి వచ్చినవాళ్ల ఇంటికి వెళొద్దని ప్రజలకు సూచించారు. మీ పిల్లలను వైరస్ బారినపడకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారిని ప్రత్యేక బృందాలు ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. కరోనా నియంత్రణకు కేంద్రం, రాష్ట్రం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. తప్పులు జరిగితే మీడియా కూడా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. అత్యవసరాల చట్టం 1987 ప్రకారం అధికారులకు మెజిస్ట్రీరియల్ అధికారాలు కల్పిస్టున్నామన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా అధికారులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇది పౌర బాధ్యతకు సంబంధించిన విషయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment