
కాల్పుల ఘటనపై అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శాసనసభలో ప్రకటన చేశారు. 'మార్నింగ్ వాక్లో భాగంగా అరబిందో వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి పార్కుకు వెళ్లారు. ఉదయం 7.15 గంటలకు నిత్యానందరెడ్డి కారు ఎక్కారు. అదే సమయంలో మరో డోరు నుంచి ఏకే 47 తుపాకీతో ఆగంతకుడు కారులోకి ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. నిత్యానందరెడ్డి ఆగంతకుడిని ప్రతిఘటించారు. తుపాకీని చేతితో పక్కకు తోశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అప్పుడే ఏకే 47 పేలి కారు ముందు అద్దం నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కారు బాడీలోకి కూడా ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. ఇది నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి గమనించారు.
ఆగంతకుడిని పట్టుకోవడానికి ట్రై చేశారు. ఆగంతకుడు ప్రసాద్ రెడ్డి చేతిని కొరికి పారిపోయాడు. సంఘటనా స్థలంలోనే ఏకే 47, బ్యాగు వదిలి పరారయ్యాడు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 307,363 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. కాల్పుల ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. కాల్పులకు వాడిన ఏకే 47 గ్రేహౌండ్స్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబర్ 26న తుపాకీని దొంగిలించినట్లుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయ్యింది. కేసు ఛేదించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.' అని కేసీఆర్ సభలో వెల్లడించారు. కాగా కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై ఆగంతకుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.