రాజకీయ సుస్థిరతకే ప్రాధాన్యం | KCR Completes 30 days as telangana first CM | Sakshi
Sakshi News home page

రాజకీయ సుస్థిరతకే ప్రాధాన్యం

Published Wed, Jul 2 2014 1:40 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

రాజకీయ సుస్థిరతకే ప్రాధాన్యం - Sakshi

రాజకీయ సుస్థిరతకే ప్రాధాన్యం

* రెండు సభల్లో టీఆర్‌ఎస్ బలోపేతం  
* పాలనలో ముద్రకు యత్నాలు  
* కేసీఆర్ సర్కారు  30రోజులు
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా నెల రోజులు. జూన్ 2న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. ఈ నెల రోజుల వ్యవధిలో రాజకీయ సుస్థిరతకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పాస్ మార్కులు(63 అసెంబ్లీ సీట్లు) రావడంతో భవిష్యత్తులో విపక్షాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు పక్కా రాజకీయ వ్యూహంతో ఆయన ముందుకెళుతున్నారు.

బీఎస్పీకి  చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరిని తనవైపు తిప్పుకొనేందుకు రహస్య మంతనాలు జరిపారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన 10 మంది ఎమ్మెల్సీలకూ గులాబీ కండువా కప్పారు. దీంతో శాసనమండలిలోనూ మెజారిటీ సాధించారు.  మండలాధ్యక్షులు, మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో మెజారిటీ పీఠాలను దక్కించుకుని స్థానికంగా సత్తాను చాటుకునే పనిలో పడ్డారు.

ఈ ఏడాది ఆఖరులో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించి టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చాలన్న లక్ష్యంతో  అడుగులేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మజ్లిస్‌ను దోస్తీ చేసుకోవడంలోనూ విజయం సాధించారు. పార్టీ నేతల్లో అసంతృప్తి తలెత్తకుండా ఉండేందుకు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ వంటి కీలక పదవులతో పాటు నామినేటెడ్ పదవులను కూడా ముఖ్యమంత్రి సద్వినియోగం చేసుకుంటున్నారు.

పాలనలో కొత్త కొత్తగా..
రాష్ర్ట విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడం, ఉన్నతాధికారుల కొరత, పదవీ బాధ్యతలు స్వీకరించడానికి సమయం పట్టడం, ఉద్యోగుల పంపిణీలో అస్పష్టత వంటి పలు కారణాలు పాలనలో వేగానికి ప్రతిబంధకాలయ్యాయి. పాలనా పగ్గాలు పట్టిన తొలి రోజుల్లోనే... గత ఏడాది పంట రుణాలనే మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం చేసిన అనాలోచిత ప్రకటన కొంత ఇబ్బందికరంగా మారింది. దీన్ని అధిగమించేందుకు కేసీఆర్ జోక్యం చేసుకున్నారు.

లక్షలోపు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే పెన్షన్ల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల అమలుపై నేటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. తెలంగాణలో పుట్టిన బిడ్డలకే ఫీజుల చెల్లింపు వర్తింపజేస్తామని ప్రకటించినప్పటికీ.. దానికి సరైన ప్రాతిపదికను నిర్ణయించలేక పోయారు. తెలంగాణలో 4 నుంచి 10 వరకు విద్యనభ్యసించిన వారంతా స్థానికులేనని ఒకసారి, ముల్కీ నిబంధనలని మరోసారి, 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకే ఫీజుల పథకమని ఇంకోసారి.. ఇలా పలు ప్రతిపాదనలను సర్కారు పెద్దలు తెరపైకి తెచ్చారు.

పాలనలో తెలంగాణ ముద్ర కనిపించే దిశగా ఈ ఆలోచన కొంత విజయవంతమైందని వారు భావిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, పెన్షన్లలో అనర్హుల తొలగింపు వంటి చర్యలు పూర్తి చేశాకే.. పెన్షన్ల పెంపు వంటి నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ రెండు పడక గదులతో ఇళ్ల నిర్మాణం, వాహనాలకు కొత్త నంబర్ల కేటాయింపు వంటి విషయాల్లోనూ అస్పష్టత కొనసాగుతుండటం గమనార్హం.

ఇక పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్సు రద్దు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి కీలకాంశాలపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినప్పటికీ.. ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారు కాక వాయిదా వేస్తూ వస్తున్నారు. పీపీఏల రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదన్న భావన కొంత వ్యక్తమైంది.
 
ఒక్క హామీనైనా నెరవేర్చారా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: నెల రోజుల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పెదవి విరిచారు. ప్రభుత్వానికి నెలరోజుల సమయం తక్కువే అయినప్పటికీ టీఆర్‌ఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేక పోయిందని విమర్శించారు. కీలకమైన రుణమాఫీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలపైనా స్పష్టత ఇవ్వలేకపోయారని అన్నారు.

నెల రోజుల పాలనలో కేసీఆర్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. బీజేపీ గెలిస్తే మంచిరోజులు వస్తాయని ప్రచారం చేసిన మోడీ నెల రోజుల్లో రైల్వే, పెట్రోలు ఛార్జీలు పెంచడం మినహా సాధించిందేమీ లేదన్నారు. ఆయన పాలన చూస్తుంటే మోడీతో ధరల దాడే అనే భావన కలుగుతోందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement