పోలింగ్ సరళిపై ఆరాతీసిన సీఎం
ఫాంహౌస్‌కు చేరుకున్న కేసీఆర్
జగదేవ్‌పూర్: సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో శనివారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాట్లు చేశారు.
ప్రజ్ఞాపూర్ నుంచి వ్యవసాయక్షేత్రం వరకు అడుగుడునా పోలీసు బలగాలను మొహరించారు. మెటల్ డిటెక్టర్, డాగ్‌స్క్వాడ్‌తో కల్వర్టుల వద్ద తనఖీలు నిర్వహించారు. మధ్యాహ్నాం 2.35 నిమిషాలకు సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆయన అక్కడి పంటలను పరిశీలించారు. అక్కడి నుంచే ఓటింగ్ సరళిని ఫోన్ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి ఆయన ఫాంహౌస్‌లో బసచేసి ఆది వారం హైదరాబాద్ వెళ్లనున్నట్లు సమాచారం.
బాల్‌రాజు, కిష్టన్న పోలింగ్ ఎట్లుంది..
వ్యవసాయక్షేత్రానికి వెళ్తూ శనివారం కొద్దిసేపు ఎర్రవల్లి గ్రామంలో ఆగిన సీఎం కేసీఆర్ పోలింగ్ శాతం ఎట్లుంది, బాగా నడుస్తోందా.. ఓటర్లు ఏమనుకుంటున్నరు..అంటూ స్థానిక సర్పంచ్ భర్త బాల్‌రాజు, నాయకులు కిష్టారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 80 శాతం పోలింగ్ నమోదైందని వారు సీఎంకు వివరించారు.
కేసీఆర్ కాన్వాయ్ ఎర్రవల్లిలో ఆగడంతో గ్రామానికి చెందిన యువకులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు.