‘పాలమూరు’ను పరుగులు పెట్టించాల్సిందే!   | KCR focus on Palamur-Ranga Reddy works | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ను పరుగులు పెట్టించాల్సిందే!  

Published Thu, Dec 13 2018 2:15 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

KCR focus on Palamur-Ranga Reddy works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మందకొడిగా సాగుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఈమారు పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో ఇచ్చిన మాట మేరకు ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి నీళ్లందించేలా అప్పుడే ప్రణాళికలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న ప్రధాన అడ్డంకులను దాటుతూనే, సమృద్ధిగా నిధులను అందుబాటులో ఉంచే చర్యలపై ఆయన పార్టీ ముఖ్యులతో చర్చించినట్లుగా తెలిసింది. రుణాలు ఇచ్చేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్న దృష్ట్యా, వాటి సహకారంతో పనులను అనుకున్న సమయానికి పూర్తి చేద్దామని ఆయన పార్టీ జిల్లా నేతలతో అన్నట్లుగా తెలిసింది.  

నిధుల కొరతతో తగ్గిన వేగం 
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిగినా విడుదల మాత్రం జరుగలేదు. దీంతో వివిధ ప్యాకేజీల్లో పనులు నెమ్మదించాయి. ప్యాకేజీ–1 పనులను రూ.3,208 కోట్లతో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను తీసుకునేలా సర్జిపూల్, ఒక్కో విద్యుత్‌ మోటారు 145 మెగావాట్ల సామర్థ్యం గల 8 పంపులను ఏర్పాటు చేసే లక్ష్యంతో చేపట్టారు. అయితే ఈ ఆగస్టులో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడంతో పనులు ఆగాయి. సొరంగం పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వీటికి తోడు బిల్లుల చెల్లింపు నెమ్మదించడంతో పనుల్లో వేగం తగ్గింది. రెండు ప్యాకేజీల్లో అంజనగిరి రిజర్వార్‌ పనులు 50 శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. పదో ప్యాకేజీలోని వట్టెం రిజర్వాయర్‌ పనులు, ప్యాకేజీ–9, 11 ప్యాకేజీల్లోని పనులు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కేవలం 20 శాతం పనులే పూర్తి చేశారు.  

రుణాల కోసం ప్రయత్నాలు 
ముఖ్యంగా కాళేశ్వరం సహా పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వాటికే నిధులు వెచ్చించడంతో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో వెనుకబడింది. దీంతో రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలకు బ్యాంకులు నేరుగా రుణాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులోని ఎలక్ట్రో మెకానికల్‌ పనులకు రుణాలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఈ పనులకు రూ.17 వేల కోట్లు అవసరం ఉండగా అంత మొత్తం రుణాలిచ్చేందుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) ముందుకొచ్చినా ఈ ప్రక్రియ ముందుకు వెళ్లలేదు. ప్రస్తుత కొత్త ప్రభుత్వంలో దీన్ని పూర్తి చేసి మార్చి నాటికి రుణాలు పొందాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రుణాల ప్రక్రియ కొలిక్కి వస్తే ప్రాజెక్టు పనులు వేగిరం కానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement