‘గుర్తింపు’ సమస్యపై ‘కవిత’ దృష్టి
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ముఖ్యంగా కార్మికులకు శాపంగా మారింది. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కార కాకుండా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. అంతేకాకుండా గుర్తింపు సంఘాన్ని ఇతర యూనియన్లు చులకనభావంతో చూస్తున్నారు.
అవకాశం దొరికితే చాలు విమర్శలతో దాడికి దిగుతున్నాయి. అయినా మాతృపార్టీ అయిన టీఆర్‌ఎస్ మాత్రం యూనియన్‌లో నెలకొన్న సమస్య పరిష్కారానికి దృష్టిపెట్టలేక పోయింది. దీంతో ఇరువురు నాయకుల మధ్య ఉన్న విభేదాలు యూనియన్ చందా విషయంలో మరింత వైరాన్ని పెంచాయి. కోర్టు వరకూ వెళ్లడంతో సమస్య జఠిలంగా మారింది.
నాయకుల తీరు వల్ల యూనియన్ పరువు బజారున పడడంతోపాటు కార్మికుల నుంచి ఆదరణ క్రమేణా తగ్గిపోతోంది. ఈ క్రమంలో పలువురు పార్టీ ముఖ్యనేతలు జోక్యం చేసుకుని సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కరించే బాధ్యతను ఆయన నిజామాబాద్ ఎంపీ, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవితపై పెట్టినట్టు తెలిసింది. క్రమంలో శనివారం కెంగెర్ల మల్లయ్య వర్గానికి చెందిన వివిధ డివిజన్లకు చెందిన నూనె కొమురయ్య, గండ్ర దామోదర్‌రావు, ఐలి శ్రీనివాస్, జె.రవీందర్, ఓ.రాజశేఖర్, బంటు సారయ్య, అప్పాని శ్రీనివాస్, మండ సంపత్, రమేష్ తదితరులు ఎంపీ కవితను కలిశారు.
అయితే మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, యూనియన్‌కు చెందిన ఇరు వర్గాల ముఖ్య నాయకులను కూర్చుంబెట్టి అంతర్గత సమస్యను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటానని, ఇందుకు ఈనెల 22 లేదా 23వ తేదీన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కవిత వారికి హామీ ఇచ్చినట్లు యూనియన్ వర్గాల ద్వారా తెలిసింది.