సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల వల్ల రెండోసారి పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం... వాటిని తిరిగి నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సోమవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా తీవ్రత దృష్ట్యా...
హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునివ్వగా అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి నీలినీడలు పడకుండా సత్వరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలించనున్నారు.
అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికితోడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొందరు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే మిగిలిన విద్యార్థుల్లో మానసిక ఆందోళన మరింత పెరిగే ప్రమాదముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పరీక్షలను ఈ ఏడాది రద్దు చేసి ఇంటర్నల్ మార్కులు లేదా ప్రీఫైనల్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను సైతం ప్రభుత్వం పరిశీలించనుంది.
వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే ముందు నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల మార్కుల ఆధారంగా ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేయాలని ఉపాధ్యాయ వర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి సూచనలు వస్తున్నాయి. ప్రీ ఫైనల్ పరీక్షల మార్కులు ఇప్పటికే విద్యాశాఖ వద్ద ఉండటంతో ఫలితాల ప్రకటన కూడా సత్వరంగా చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం సమీక్ష ముగిసిన వెంటనే పదో తరగతి పరీక్షలు, విద్యార్థుల భవితవ్యంపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితిల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించి ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా వారికి గ్రేడింగ్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది.
1951లో ఓయూ పరీక్షల రద్దు.. అంతా పాస్
హైదరాబాద్ సంస్థానం 1951లో భారత్‌లో విలీనమైనప్పుడు చెలరేగిన అల్లర్ల కారణంగా అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల విలేకరుల సమావేశంలో గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఇదే అత్యుత్తమ నిర్ణయమని ప్రభుత్వ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
లాక్‌డౌన్ మళ్లీ కఠినం!
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రకటించిన సడలింపుల్లో కొన్నింటిపై ఈ భేటీలో పునఃపరిశీలన చేసే అవకాశముంది. కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. ప్రధానంగా మాల్స్‌తోపాటు ప్రార్థనా స్థలాలు, మతపరమైన ప్రాంతాల్లో ప్రజలను సోమవారం నుంచి అనుమతిస్తామని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించగా దీనిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై పునఃసమీక్ష జరిపి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలిస్తే రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరిగి రోగులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, వైద్య సదుపాయాలు సరిపోవని కొందరు సీనియర్ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అంశాలతోపాటు కరోనాకు సంబంధించిన అన్ని విషయాలను సమీక్షలో చర్చించి సీఎం కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment