సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. మంగళ, బుధవారం (రెండురోజులు) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులను సందర్శించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శనివారం రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ పర్యటన ఖరారైంది. 18న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌లను సందర్శించిన అనంతరం రాత్రివరకు అధికారులతో సమీక్ష జరపాలని నిర్ణయించుకున్నారు. అనంతరం కరీంనగర్ తెలంగాణ భవన్‌లో రాత్రి బస చేసి.. బుధవారం ఉదయం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు పరిశీలించాలనకున్నారు. కానీ.. పెథాయ్ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సీఎంవో వర్గాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు సమాచారం అందించాయి. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే దానిపై త్వరలోనే నిర్ణయించి ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment