ప్రతి మహిళ ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవించాలి.. మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా కేసీఆర్ కిట్లను అమల్లోకి తేస్తున్నాం. ప్రసవించిన ప్రతి మహిళకు రూ.2 వేల విలువైన సామగ్రి అందిస్తాం. పుట్టిన ప్రతి శిశువుకు దీని ద్వారా లభించే వస్తువులను వాడుకోవాలి. అని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది జూన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కానీ.. ఆచరణలో విఫలమైంది.
ఎంజీఎం : కేసీఆర్ కిట్ల పథకం ముణ్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రారంభంలో మాత్రమే గర్భిణులు, బాలింతలకు సక్రమంగా పంపిణీ కాగా.. ఆ తర్వాత ఏదో ఒక వస్తువు కొరత పీడిస్తోంది. తాజాగా జిల్లా ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్లు నిండుకున్నాయి. వరంగల్ సీకేం ఆస్పత్రిలో 15 రోజులుగా.. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల (జీఎంహెచ్)లో నాలుగు రోజులుగా కేసీఆర్ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సఖప్రసవాల సంఖ్యను పెంచి, మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన కేసీఆర్ కిట్ల పంపిణీ మూణ్నాళ్ల ముచ్చటగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీకేఎం ఆస్పత్రిలో..
వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్లు లేవని.. రాగానే అందజేస్తామని పంపించి వేస్తున్నారు. కిట్లు రాగానే పంపిస్తాం.. మీ వివరాలు రాసుకుంటున్నామంటూ తెలుపుతూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సుమారు 15 రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. కేసీఆర్ కిట్లు అమల్లోకి రాక ముందు ఆస్పత్రిలో ప్రతి రోజు 20 వరకు ప్రసవాలు జరుగుతుండేవి. కిట్ల పథకం అమల్లోకి వచ్చిన ఈ సంఖ్య 30 వరకు పెరిగింది. ఈ లెక్కన ఆస్పత్రిలో ప్రతి రోజు 25 నుంచి 30 కిట్లు అవసరమవుతుంటాయి. అధికారులు ముందస్తుగా కేసీఆర్ కిట్లను సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు పలువురు గర్భిణులు, బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 15 రోజులుగా సుమారు 400 మంది మహిళలు కేసీఆర్‌కిట్లు అందకోకుండానే డిశ్చార్జి అయ్యారు.
‘ప్రైవేట్’కు పరుగు
కేసీఆర్ కిట్టును మహిళ ప్రసవించిన రోజే అందించాలని ప్రభుత్వం పేర్కొ ంది. ఈ కిట్టులో రూ. 2 వేల విలువ చేసే 16 వస్తువులు ఉన్నాయి. చిన్నారి కిట్టులో దోమ తెర, బేబి మాకిటోష్, రెండు డ్రెస్‌లు, రెండు టవల్స్, బేబి న్యాపికిన్స్, జాన్సన్ బేబి పౌడర్, బేబి షాంపో, బేబి ఆయిల్, బేబి సబ్బు, బే బి సోప్ బాక్స్, ఆట వస్తువులు.. అదేవిధంగా తల్లికి సంబంధించి రెండు సబ్బులు, రెండు చీరలు, కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్ ఉంటోంది. పాప ప్రసవించిన సమయానికి అధికారులు కి ట్టు అందించకపోవడంతో ఈ అవసరమైన సామగ్రి తప్పనిసరి పరిస్థితులో ప్రైవేట్‌లో కొనుగోలు చేయక తప్పడం లేదు.
జీఎంహెచ్‌లో..
మూడు నెలల క్రితం కేసీఆర్ కిట్ల పథకం జీఎంహెచ్‌లో ప్రారంభం కాగా.. నెల రోజుల పాటు సాఫీగానే సాగింది. కిట్ల సరఫరాలో ఆలస్యం.. ఇతర కారణాలతో మధ్యలో కిట్లను సకాలంలో అందించలేకపోయారు. అంతేకాకుండా.. కొన్ని కిట్లను చీర లేకుండానే పంపిణీ చేశారు.తాజాగా.. ఈ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా కిట్లు నిండుకున్నాయి.
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..
నాలుగు రోజులుగా కేసీఆర్ కిట్ల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులు మరో రెండు రోజులు ఆగాల్సిందేనని ఆస్పత్రి వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచే సరఫరా ఆగిపోయిందని, కిట్టులో గల ఉత్పత్తుల కొరత కారణంగానే ఆలస్యమవుతున్నట్లు పేర్కొంటున్నాయి. కిట్ల కొరతపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు.. ఇండెట్లు సైతం పంపించినట్లు తెలుస్తోంది. డిశ్చార్జి అవుతున్న బాలింతలు కిట్ల కోసం ఎదురుచూసి చేసేది లేక వెళ్లిపోతున్నారు. ఆస్పత్రి సిబ్బంది మాత్రం వారి ఫోన్ నంబర్లు తీసుకుంటున్నాం కిట్లు రాగానే సమాచారం ఇచ్చి.. వారికి అందజేస్తామని చెబుతున్నారు.
4 రోజుల్లో 54 మందికి ఇవ్వాలి
కేసీఆర్ కిట్లు అయిపోతున్నాయన్న ఒక్క రోజు ముందే ఇండెంట్ పంపించాం. కిట్లు కావాలని ప్రతిపాదనలు పంపించి నాలుగు రోజు లైంది. ఈ రోజు కూడా డీఎంహెచ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడాను. హైదరా బాద్ నుంచి రావాలని చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో 54 మందికి కేసీఆర్ కిట్లు అందించాల్సి ఉంది. రాగానే పిలిచి అందిస్తాం.
– డాక్టర్ నిర్మల, సూపరింటెండెంట్, జీఎంహెచ్, హన్మకొండ
ప్రతిఒక్కరికీ కిట్టు అందిస్తాం..
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించిన ప్రతి మహిళకూ కేసీఆర్ కిట్టు అందిస్తాం. సీడీఎస్ నుంచి సమయానికి కిట్లు రావడం లేదు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేస్తామని చెప్పారు. ఆస్పత్రిలో ప్రసవించిన ప్రతి మహిళ వివరాలు నమోదు చేసుకుంటున్నాం., కిట్లు రాగానే వారికి సమాచారం ఇచ్చి అందజేస్తాం.
– రాజేంద్రప్రసాద్, సీకేఎం సూపరింటెండెంట్