హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచండి | KCR orders to officials Increase the brand image of Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచండి

Published Tue, Jun 24 2014 3:40 AM | Last Updated on Fri, Sep 7 2018 1:56 PM

KCR orders to officials Increase the brand image of Hyderabad

* పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్
* నగరం నుంచే సంస్కరణలు మొదలుపెట్టాలని సూచన
* క్లబ్బులు, పేకాట కేంద్రాలపై కఠిన చర్యలకు ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్ : అమెరికా, బ్రిటన్ వంటి  అగ్ర దేశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అనుసరించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. పోలీస్ శాఖలో ప్రతిపాదిస్తున్న సంస్కరణలను మొదట నగరంలో అమలు చేయాలని, తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో రాష్ర్ట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పోలీస్ శాఖలో సంస్కరణలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు, వాహనాల ఆధునీకరణ, అందుకు సంబంధించిన డిజైన్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచి ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారు.
 
  హైదరాబాద్- సైబరాబాద్‌లను కలిపి ఒకే కేంద్ర కమాండెంట్ కిందకు తీసుకురావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వ్యవహార శైలిలో మార్పు తీసుకువచ్చేలా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో కానీ  శిక్షణ ఇప్పించాలని సూచించారు. పోలీసుల పనితీరు వారి చలనశీలత(మొబిలిటీ)పైనా ఆధారపడి ఉంటుందని, సరైన సమయంలో వేగంగా స్పందించడం ద్వారా శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ వివరించారు. ప్రస్తుతమున్న వాహనాల కొరతను తీర్చేందుకు యూనిట్లవారీగా లెక్కగట్టి తగిన సంఖ్యలో కొత్త వాటిని కొనుగోలు చేస్తే అనేక ఇబ్బందులను అధిగమించవచ్చని సూచించారు. ఇక యువతను పెడదోవ పట్టిస్తున్న గ్యాంబ్లింగ్, పేకాట, మట్కా కేంద్రాలతో పాటు వాటిని నిర్వహిస్తున్న క్లబ్బులపై ఉక్కుపాదం మోపాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు.
 
  జిల్లాల్లో రిక్రియేషన్ క్లబ్బుల ముసుగులో గ్యాంబ్లింగ్ కార్యక్రమాలు నిర్వహించే కేంద్రాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంతటి వారి నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఖాతరు చేయొద్దని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును హరించి వారిని వ్యసనాల బాట పట్టిస్తున్న ఇటువంటి కేంద్రాలు ఇకపై రాష్ట్రంలో నడవడానికి వీల్లేదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో  నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement