* 30 మంది ఎమ్మెల్యేలతో స్వయంగా బేరాలు సాగించారు
* ‘ఓటుకు నోటు’పై మరిన్ని ఆధారాలతో గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదిక
* రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో గగ్గోలు
* కేసును తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు
* చంద్రబాబువన్నీ పచ్చి అబద్ధాలు..
* ఈ వ్యవహారంలో సూత్రధారి ఆయనే గవర్నర్‌తో గంటన్నర పాటు సీఎం కేసీఆర్ భేటీ
* రాజధానిలో శాంతిభద్రతలకు ఢోకా లేదని, సెక్షన్ 8కు ఒప్పుకోబోమని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడేనని, టీఆర్‌ఎస్ సర్కారును కూల్చేందుకు బాబు కుట్రపన్నారని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివేదించారు. కోట్లాది రూపాయలు కుమ్మరించి దాదాపు ముప్ఫై మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుతంత్రాలు జరిగాయని వివరించారు. ఈ మేరకు కీలక ఆధారాలను గవర్నర్‌కు అందజేశారు. ఈ వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు... ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని.. అవాస్తవ ఆరోపణలతో దర్యాప్తు అధికారుల మనోస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో స్టీఫెన్‌సన్‌కు రేవంత్ రూ.50 లక్షలు ఇవ్వజూపుతున్న దృశ్యాల వీడియోలతో పాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు.. అడ్డగోలు ఆరోపణలకు దిగడంతో పాటు విభజన చట్టంలోని సెక్షన్-8ని అమలు చేయాలంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించిన పురోగతి, చంద్రబాబు ప్రమేయంపై మరిన్ని ఆధారాలను అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడటం, అదే వ్యవహారంలో చంద్రబాబు ఫోన్ సంభాషణలు బట్టబయలైనందుకే.. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రులు అరిచి గగ్గోలు పెడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
బాబువి పచ్చి అబద్ధాలు
తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలాడారని, హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాలంటూ ఢిల్లీకి వెళ్లి వితండ వాదనలు చేశారని గవర్నర్‌కు కేసీఆర్ నివేదించారు. రాజధాని హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని.. రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముళ్లలా కలసిమెలసి ఉంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలో హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య దాడులు, ఘర్షణల్లాంటి ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయితే గవర్నర్‌తో సీఎం భేటీకి ముందే ప్రభుత్వ సీఎస్‌తో డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి భేటీ అయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిని కేసుల గణాంకాలు సహా విశ్లేషిస్తూ నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను గవర్నర్‌కు సీఎం కేసీఆర్ అందించినట్లు తెలిసింది. లంచం తీసుకుంటూ స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ముఖ్యమంత్రి పట్టుబడితే సెక్షన్ 8తో పనేముందని.. అందుకు ఒప్పుకునేది లేదని గవర్నర్‌తో సీఎం పేర్కొన్నారు.
‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ చట్టప్రకారం వ్యవహరిస్తుందని, దర్యాప్తు ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి తప్పించుకోవాలని చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి, రాష్ట్రపతికి బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఈ వ్యవహారంపై కేంద్రం నివేదికను కోరగా.. గవర్నర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు, కేసుకు సంబంధించిన పూర్వాపరాల నివేదికను హోంశాఖకు సమర్పించారు కూడా. తాజాగా సీఎం కేసీఆర్ అందజేసిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి వివరాలతో మరో నివేదికను గవర్నర్ కేంద్రానికి నివేదించే అవకాశం ఉంది.
ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారు
పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు, కృష్ణా జలాల అంశంపైనా గవర్నర్, సీఎం మధ్య చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే రూపకల్పన జరిగిందని, అప్పుడిచ్చిన ఉత్తర్వులే ఇప్పటికీ ఉన్నాయని గవర్నర్‌కు కేసీఆర్ నివేదించారు. కృష్ణాజలాల్లో వాటాలపై ఏపీ అభ్యంతరాల్లో పస లేదని, గతంలో బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్స్ తీర్పు ల ప్రకారం తెలంగాణకు స్పష్టమైన నీటి వాటాలు ఉన్నాయని వివరించారు. పోలవరం నుంచి గోదావరి నీటిని పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని.. అదే తెలంగాణలో రైతులను, ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకునేందుకు నిర్మించే పాలమూరు, డిండి ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని.. ఇది సమంజసం కాదని గవర్నర్‌కు వివరించారు.
తప్పుడు సంకేతాలు వెళ్లాయి
‘ఓటుకు నోటు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయమున్న సాక్ష్యాధారాలపై విశ్లేషణ జరుగుతున్న సమయంలో... గవర్నర్ సలహాదారులు చంద్రబాబు ఇంటికి వెళ్లడం తప్పుడు సంకేతాలు పంపిందని గవర్నర్‌కు కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు సమాచారం. ఇక కేసీఆర్ నీచంగా మాట్లాడుతున్నారంటూ ఏపీ మంత్రులు తనకు ఫిర్యాదు చేసిన అంశాన్ని గవర్నర్ ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, తమ ప్రభుత్వంపై జరిగే కుట్రలపై ఘాటుగా స్పందించాల్సి వచ్చిందని కేసీఆర్ వివరణ ఇచ్చుకున్నారు.
మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు కుట్ర
Published Tue, Jun 16 2015 1:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement