వారంలో రుణమాఫీ..!
తెలంగాణ ప్రభుత్వం కసరత్తు.. సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలూ మాఫీ
18,000 కోట్ల రూపాయల భారం
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ రైతులకిచ్చిన హామీ మేరకు రుణ మాఫీ అమలుపై రాష్ర్ట ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా లక్షలోపు రుణాలను మాఫీ చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వారం రోజుల్లోనే కేబినెట్‌లో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రుణ మాఫీకి ఎలాంటి షరతులు విధించబోమని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ర్ట ప్రభుత్వప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి తదితరులతో ఈ అంశంపై ఆయన సమీక్ష జరిపారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట రుణాలతో పాటు పాత బకాయిలు, బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేయడం వల్ల దాదాపు 26 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు అధికారులు వివరించారు. ఇందుకు దాదాపు రూ. 18 వేల కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేశారు. దీంతో కేసీఆర్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై కేసీఆర్ అప్పటికప్పుడు తన మంత్రివర్గంతో అత్యవసరంగా భేటీ కావాలని భావించారు.
అయితే కొన్ని తప్పనిసరి విధివిధానాలు పాటించాల్సి ఉన్నందున, వెంటనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించలేరని అధికార వర్గాలు చెప్పడంతో ఆ ఆలోచనను సీఎం విరమించుకున్నట్లు సమాచారం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పంట పెట్టుబడికి అవసరమైన రుణాలను రైతులు బ్యాంకుల నుంచి పొందాలంటే సాధ్యమైనంత త్వరగా పాత రుణాల మాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాధారణంగా ఏటా మేలోనే రుణాల మంజూరు మొదలవుతుంది. కానీ ఈసారి ఇంకా ఆ ఊసే లేదు. అన్ని వర్గాలూ రుణ మాఫీ కోసమే వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కేబినెట్‌లో ఆమోదించి.. రుణ మాఫీని అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం లక్ష రూపాయల్లోపు మాత్రమే రైతుల రుణం మాఫీ కానుంది. అంతకంటే ఎక్కువ రుణ భారం ఉంటే.. రూ. లక్షపోగా మిగిలిన మొత్తాన్ని రైతులు భరించాల్సి ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
బంగారం తాకట్టు రుణాల్లో వ్యవసాయానికి తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని కూడా పేర్కొన్నారు. ఈ నిధులను బ్యాంకులకు ఏ రూపంలో చెల్లించాలన్న దానిపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని ఏటా నాలుగైదు వేల కోట్ల రూపాయల చొప్పున నాలుగైదేళ్లలో వడ్డీతో సహా చెల్లించడం, రిజర్వ్ బ్యాంకు ఆమోదించేపక్షంలో.. గతంలో ఇంధన శాఖ బకాయిలు చెల్లించడానికి బాండ్లు విడుదల చేసిన విధానాన్ని అనుసరించడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించినట్లు తెలిసింది. అయితే బాండ్ల జారీ విధానాన్ని రిజర్వ్ బ్యాంకు పూర్తిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. నగదు చెల్లిస్తే తప్ప... రుణాల మాఫీకి అంగీకరించేది లేదని ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఇటీవలే లేఖ కూడా రాసింది.