కొలువైన కేసీఆర్ మంత్రివర్గం | KCR sworn in; heads cabinet of 11 ministers | Sakshi
Sakshi News home page

కొలువైన కేసీఆర్ మంత్రివర్గం

Published Mon, Jun 2 2014 10:09 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

KCR sworn in; heads cabinet of 11 ministers

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. కేసీఆర్ మంత్రివర్గంలో తొలిగా 11మంది టీఆర్ఎస్ నేతలకు చోటు దక్కింది. గవర్నర్ నరసింహన్ సోమవారం 11మంది టీఆర్ఎస్ నేతలతో మంత్రులగా ప్రమాణ స్వీకారం చేయించారు.

కేసీఆర్ మంత్రివర్గం వివరాలు....

 మహముద్ అలీ (ఎమ్మెల్సీ)

తొలి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన అలీ.....రాజకీయ రంగప్రవేశానికి ముందే కేసీఆర్‌కు సన్నిహితుడు. 2001లో గులాబీ దళంలో చేరారు. మైనార్టీ వర్గాలను ఉద్యమం వైపు ఆకర్షించడంలో కీలకపాత్ర వహించారు. 2009లో సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011లోనూ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.  గతేడాది పార్టీ తరపున మండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడు మైనార్టీ కోటా కింద  క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.


డా. తాటికొండ రాజయ్య (స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే)

వరంగల్ జిల్లాకి చెందిన తాటికొండ రాజయ్య చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజయ్య 1999 ఎన్నికల్లో ఓడిపోయారు.  2009లో టీడీపీ అభ్యర్థి అయిన కడియం శ్రీహరిపై గెలుపొందారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ లక్షణాలు నచ్చి 2001లో కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరారు.

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో  గెలుపొందారు. తాజాగా జరిగిన 2014 ఎన్నికల్లో కూడా వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నుంచి 58,862 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.- 1965, జూలై 12న జన్మించారు. స్వస్థలం - వరంగల్ జిల్లా తాటికొండ. విద్యార్హత - ఎంబీబీఎస్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం.

 నాయిని నర్సింహారెడ్డి

తొలి విడతలో పార్టీ సీనియర్ నేత  నాయిని నర్సింహారెడ్డికి చోటు దక్కింది.  హైదరాబాద్‌కు చెందిన నాయిని.. 1978లో తొలిసారిగా జనతాపార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు.

తిరిగి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై  ముషీరాబాద్‌ నుంచి విజయకేతనం ఎగరవేశారు. అయితే 2009 సాధారణ ఎన్నికల్లో  ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొన్నాళ్లుగా పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా కొనసాగుతున్న నాయిని...మాస్‌ లీడర్‌గా మంచి గుర్తింపు పొందారు. పార్టీ సంక్షోభ సమయాల్లో అండగా నిలిచారు.  సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

ఈటెల రాజేందర్ (హుజురాబాద్ ఎమ్మెల్యే)
  తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల.... ఉస్మానియా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి నేతగా మంచి పేరున్న ఈటెల.... 2002లో టీఆర్ఎస్‌లో చేరారు. 2004లో కమలాపూర్‌ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నియ్యారు. తర్వాత హుజూరాబాద్‌ నుంచి 2009 సాధారణ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. ఆది నుంచి పార్టీలో కీలకపాత్ర వహిస్తున్న ఈటెల...పార్టీ శాసనసభాపక్షనేతగా కూడా పనిచేశారు.


పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ ఎమ్మెల్యే)

 తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం.....కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ రంగప్రవేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చక 1984లో పార్టీని వీడి టీడీపీలో చేరారు. 1994లో తొలిసారిగా బాన్సువాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లోనూ టీడీపీ టికెట్‌పై గెలుపొందిన పోచారం.... 2004 ఎన్నికల్లో  ఓడిపోయారు. తిరిగి 2009 ఎన్నికల్లో విజయబావుట ఎగరవేశారు.

అయితే తెలంగాణ అంశం పట్ల పార్టీ తీరును వ్యతిరేకిస్తూ.... టీడీపీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2011లో టీఆర్ఎస్‌లో చేరారు. వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లోనూ సూపర్‌ విక్టరీ కొట్టిన పోచారం...కొన్నాళ్లుగా టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా కొనసాగుతున్నారు. ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ పరిధిలో మాస్‌లీడర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.


తన్నీరు హరీష్‌ రావు(సిద్దిపేట ఎమ్మెల్యే)

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తన్నీరు హరీష్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వయాన మేనల్లుడైన హరీష్‌...1991 నుంచి మేనమామకు అండాదండాగా నిలిచారు. హరీష్‌ 2004లో తొలిసారిగా సిద్ధిపేట  నుంచి అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. జననం : 1972, జూన్ 3. స్వస్థలం : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి. 2004, 2008, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 లో తొలిసారిగా వైఎస్సార్‌ కేబినెట్‌లో యువజన సర్వీసులు మంత్రిగా పనిచేశారు.

పద్మారావు(సికింద్రాబాద్ ఎమ్మెల్యే)
తెలంగాణ తొలి రాష్ట్ర మంత్రిగా టీ పద్మారావు ప్రమాణ స్వీకారం చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన పద్మారావు..టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌ వెంటే ఉన్నారు. 2004లో సికింద్రాబాద్‌ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అయితే 2009 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి జయసుధపై పోటి చేసి ఓడిపోయారు. తిరిగి 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎప్పుడూ  ప్రజల మధ్య ఉంటూ మాస్‌ లీడర్‌గా పద్మారావు మంచి పేరు తెచ్చుకున్నారు.

 పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు ఎమ్మెల్యే)
తొలి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్‌రెడ్డి...టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1994 సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా తాండూర్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నికయ్యారు. తర్వాత 2009, 2004 ఎన్నికల్లోనూ వరుసగా విజయబావుట ఎరగవేశారు.

అయితే 2009 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. తెలంగాణపై పార్టీ అధినేత తీరును వ్యతిరేకిస్తూ  టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో  తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. నియోజకవర్గంలోనే కాక  జిల్లా స్థాయిలోనూ పట్నం మహేందర్‌రెడ్డి  మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.


కె. తారక రామరావు (సిరిసిల్ల ఎమ్మెల్యే)

కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ అధినేత కుమారుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కేటీఆర్...2009 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల స్థానం నుండి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. 2014లో సిరిసిల్ల స్థానం నుంచి మరోసారి గెలుపొందారు.

పార్టీలో చేరిక నుంచి యువతను ఆకర్షించడంలో కీలకపాత్ర వహించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివినా కేటీఆర్..మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు, ఉర్ధూ బాషాలను అనర్గలంగా మాట్లాడగలరు.  జననం : 1976, జూలై 26. స్వస్థలం : మెదక్ జిల్లా చింతమడక. విద్యార్హత : ఎమ్మెస్సీ, ఎంబీఏ. 2009, 2010, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. అమెరికాలో ఉద్యోగం వదిలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు.

జోగు రామన్న (ఆదిలాబాద్ ఎమ్మెల్యే)

తొలి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో  జోగు రామన్న చోటు దక్కించుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన రామన్న...  1984లో టీడీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న జోగు...2004 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి  తొలిసారిగా ఓటమి పాలయ్యారు.

తిరిగి 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే తెలంగాణ పట్ల అధినేత తీరును వ్యతిరేకిస్తూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 2011లో టీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లోనూ కారు గుర్తుపై విజయం సాధించారు.


జగదీశ్వర్ రెడ్డి (సూర్యాపేట ఎమ్మెల్యే)

నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీశ్వర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా జగదీశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన  ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. 2001 పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర వహించారు. 2009లో తొలిసారిగా హుజురాబాద్‌ అసెంబ్లీకి పోటీ చేసి ఓటిమి పాలయ్యారు.

తిరిగి 2014 ఎన్నికల్లో సూర్యపేట స్థానం నుంచి పోటీ చేసి విజయబావుట ఎగరవేశారు. తెలంగాణ న్యాయవాదుల సంఘం ఏర్పాటులోనూ జగదీశ్వర్‌రెడ్డి కీ రోల్‌ పోషించారు. జిల్లాలో మంచి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న జగదీశ్వర్‌రెడ్డి... కేసీఆర్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement