కృష్ణా జలాల్లో మన వాటా మనకే! | KCR to orders Krishna water tribunal to telangana | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల్లో మన వాటా మనకే!

Published Tue, Jun 24 2014 3:53 AM | Last Updated on Wed, Aug 15 2018 8:04 PM

KCR to orders Krishna water tribunal to telangana

* బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలపై కసరత్తు
* అధికారులతో సమీక్షించిన సీఎం

 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల్లో మన వాటా మనకు దక్కే విధంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నీటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగిందని కేసీఆర్ మొదటి నుంచీ చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ట్రిబ్యునల్ ముందు సమర్థవంతమైన వాదనలను చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 
  ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన వాదనలకు భిన్నమైన అంశాలతో వాదనలను రూపొందించాలని సూచించారు. అవసరమయితే సీనియర్ న్యాయవాదుల్ని ఎంపిక చేయాలని ఆదేశించినట్టు సమాచారం. బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ ముందు జూలైలో వాదనలు జరగనున్నాయి. దాంతో ట్రిబ్యునల్ ముందు వాదించాల్సిన అంశాలకు సంబంధించి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. సమావేశంలో నీటిపారుదల మంత్రి హరీష్‌రావు, ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి  ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు.
 
 డెల్టాకు నీటి విషయంలో తగ్గేది లేదు..
 కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఉంది. రాష్ర్ట స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 25 నుంచి నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని డెల్టాకు విడుదల చేయాల్సి ఉంది. గడువు దగ్గరకు వస్తున్నా.. ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నీటి విడుదల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తాగునీరు పేరుతో ఆ నీటిని నారుమళ్లకు ఉపయోగించుకుంటారని అంచనా వేస్తోంది. అదీకాక, నాగార్జుసాగర్‌లో ఇప్పుడు 13 టీఎంసీల నీరు మాత్రమే వాడకానికి ఉందని, ఇందులో 10 టీఎంసీలు డెల్టాకు ఇస్తే.. హైదరాబాద్ నగరానికి తాగునీటికి ఇబ్బందులొస్తాయని భావిస్తోంది. అందువల్ల డెల్టాకు నీటి విడుదలను అడ్డుకోవాలనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement